Friday, August 12, 2016

శర్మ కాలక్షేపం కబుర్లు-1- గురు, దైవ వందనం


— శర్మ కాలక్షేపం కబుర్లు—
Posted on సెప్టెంబర్ 23, 2011
  

గురు, దైవ వందనం


కన్న తల్లి తండ్రులకు సాష్టాంగ దండ ప్రణామాలు. పెంచిన తల్లి తండ్రులకు సాష్టాంగ దండ ప్రణామాలు.

అడుక్కునైనా చదువుకోమన్న శ్రీ దేవరభట్ల రామా రావు గారికి నమస్కారాలు. శ్రీ. చెఱుకుపల్లి హనుమత్ కవిరాట్ లక్ష్మణశాస్త్రిగారికి, జోస్యుల వేకట నరసింహంగారికి, సమయపాలన నేర్పిన వర్రె అప్పలరాజు మాస్టరికి, తెలుగు మాస్టారు సుబ్రహ్మణ్యంగారికి, జాన్ మాస్టారికి వందనములు.

నేటి కాలంలో బోధగురువులు శ్రీచాగంటి కోటేశ్వర రావుగారికి నమస్కారం. తెలుగు వ్రాయడానికి
తన బ్లాగు ద్వారా సహకారం అందించిన శ్రీభైరవభట్ల కామేశ్వర రావు గారికి నమస్కారం. నాలుగు తెలుగు అక్షరాలు తప్పులేకుండా వ్రాయడం వచ్చినంతనే బ్లాగు వ్రాయమని ప్రొత్సహించిన భమిడిపాటి ఫణిబాబుగారికి వందనం.

ఎందరో మహానుభావులు అందరికీ వందనం.

తుండమునేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్
 మెండుగ మ్రోయు గజ్జలును మెల్లని చూపుల మంద హాసమున్
 కొండొక గుబ్జరూపమున కోరిన విద్యలకెల్ల ఒజ్జవై
 యుండెడి పార్వతీతనయ ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్.

అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలపె
 ద్దమ్మ సురారులమ్మ కడుపాఱడిపుచ్చినయమ్మ  తన్ను లో
 నమ్మినవేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గ మా
 యమ్మ కృపాభ్ధి యీవుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్.

శ్రీ మాత్రేనమః.

సమయం సందర్భం ముందే చెప్పివున్నాను.మొదటి రోజు నమస్కారాలతో సరిపెడదమనుకున్నాను. కుదరలేదు.
నమః నుంచి నమస్కారమ్, దండమ్, సాష్టాంగ నమస్కారమ్,వందనమ్ వచ్చాయి,వణక్క్కం అరవ సంస్కృతితో వచ్చింది.

సలామ్ ఆలేకుమ్ ముస్లిమ్ సంస్కృతితో వచ్చింది.

గుడ్ మార్నినింగ్, గుడీవెనింగ్ తప్పించి మరొకటి పడమటి దేశాల సంస్కృతిలో లేదు.

మరేమైన వుందేమో మరి నాకు తెలియదు. వారికి నమస్కారం పెట్టడంకూడా రాదు.

అబ్బో నేటి సమాజంలో వంక దణ్ణాలు, వంకర దణ్ణాలు, అవసర నైవేద్యం లాగా అవసరదణ్ణాలు బోలెడన్ని.

దేవుని దగ్గర స అష్ట అంగ దండ ప్రణామం చేయనివాడు, అధికారం దగ్గర నేలమీద పొర్లుతాడు. ఇది విచిత్రం. చెప్పుకుంటూ పోతే చాల వుంది. మళ్ళీ కలుద్దాo.
భాస్కర శర్మ - కష్టే ఫలే