Tuesday, December 20, 2011

బుజ్జి పండు తెలుగు చదువు - శ్రీ శంకర విజయం

బుజ్జి పండు తన తల్లి గారైన శర్కరీ జ్యోతిర్ 'మాయీ' వద్ద వారు నేర్పిన తెలుగుని నేర్చుకుంటూ తెలుగు కాంతుల విరజిమ్ముతూ తెలుగు బిడ్డగా అమెరికా దేశమునందు పెరుగు చున్నాడు.

ఆ తల్లికి, తన తనయుడు మరి ఇతర తెలుగు గురువుల వద్ద తెలుగు  నేర్చుకోవలె అనెడి కోరిక గలిగెను. తాను ఎంత నేర్పినను , సరియైన గురువు చెంత నేర్చిన విద్యయే కదా విరాజిల్లు అని ఆ తల్లి తలబోసి

'పుత్రా, బుజ్జి పండూ, నీవు నా దగ్గిర నేర్చిన తెలుగు ఇంకను అభివృద్ధి చేసుకొనుటకై నేను నిన్ను మరి కొందరు మన తెలుగు బ్లాగ్ గురువుల చెంత గురుకుల వాసము చేయుటకు పంపవలెనని నిశ్చయించితి అని ఆ మాత పలుకగా,

తనయుడు బుజ్జి పండు


'మాతా, నీ వాక్కు నాకు శిలోధాల్యము. వెంటనే సెలవీయుడు , నేను మొదట ఏ e-గులువుల వారి వద్ద వాసము చేయవలె' నని అడుగగా

ఆ మాత కడుంగడు ముదావహము తో

'పుత్రా బుజ్జి పండూ, నాకొక్క దినము అవకాశము నిమ్ము, నీకు ఆ గురువుల పేరు తెలిపెదను ' అని సంతోషానంద భరితు రాలై పుత్రోత్సాహముతో నాటి కార్యక్రమములను ముగించుటకు సంసిద్దురాలాయెను.

పుత్రుడు బుజ్జి పండు తాను నేర్చుకోబోవు తెలుగు ను దృశ్య కావ్యముగా జూచుచు నిదురయందు జారుకొనెను.


**********

శంకరార్యుల వారి శంకరాభరణం కొలువు జగజ్జేగీయ మానం గా కవి పండితాద్యులతో వెలుగొందుతోంది.

మహామహులైన పండితులు , నిష్ణాతులు , గ్రాంధికం , గ్రామ్యం కాచి వడబోసిన పెద్దల కొలువు అది.

ఆర్యులవారు చిరునగవుతో వీక్షించు చూ , తమ సహ పండితులని అష్ట దిగ్గజములై న వారిని ఒక మారు కలయ జూసినారు

కొలువులో

పండిత నేమాని వారు,
చింతా వారు
సుబ్బారావు గారు
శ్యామలీయం గారు
లక్కాకుల వారు
గోలీవారు
శ్రీపతి గారు,
రాజేశ్వరీ అక్కయ్య గారు

లాంటి అష్ట దిగ్గజములను గాంచి ఆ పై నను వున్న మీదు మిక్కిలి పండిత లోకమును గాంచి, ఆ నాటి కొలువు విశేషములు వారు మొదలు బెట్ట బూనినారు.

ఈ శంకరాభరణము కొలువు కు శ్యామలీయం గారు మంజరీ ద్వార పాలకులై ( ఆంగ్లములో గేటు కీపరు అందురు) కొలువుని కడు జాగ్రత్తగా కాపాడుకొంటూ తమ అసామాన్య ప్రతిభా పాటవాలతో ఒక వైపు ఐటీ రంగమును మరొక వైపు కవితా వెల్లువలను సమ పాళ్ళలో 'క్రోడీకరించి' న వారై , ఒక కన్ను ను ఎప్పుడు మంజరీ ద్వారముపై పెట్టి ఉందురు - ఏల అన ఎవరైనా తుంటరులు అనానిమస్సులై అక్కడ ప్రవేశించి ఏమైనా సభా భంగము గావించిన వారికి వెంటనే వారు ఝాడూ చూపించి తరిమి వేయుదురు.

అటువంటి గురుతరమైన భారముతో వారు శంకరార్యుల కొలువును గాపాడుచూ, ఒక వైపు గ్రాంధి క మా , మరో వైపు గ్రామ్యమా అన్న లక్కాకుల వారికి సమానముగా తమ బ్లాగ్కామెంట్ ఫటిమ లో నెగ్గుకుని వస్తూ, మంజరీ ద్వారమున ఒక్క మారు వీక్షించినారు శ్యామలీయం వారు.


(బుజ్జి పండు ప్రవేశం)

శ్యామలీయం మాష్టారు - తనలో

ఎవరో ఒక బుడతడు ఇటు వస్తున్నాడే ! ఈ సభా ప్రాంగణములో ఈ బుడతడికి పని ఏమి ?


ముక్కుపచ్చలారని ఈ పసిబాలుడికి ఈ ప్రబంధ ప్రదేశమున పని ఏమి ? అనుకున్న వారై,

(ప్రకాశముగా)

ఓరీ బాలకా, ఎవరవు నీవు ఎచట నుంచి నీ రాక ? అని గంభీరముగా చూసినారు. వారు గంభీర స్వరూపులు. వారి చూపులు నిశితమైనవి.

బుజ్జి పండు కొంత బెదిరి,

"మలీ మలీ అండీ, మలీ అండీ... మలీ అండీ .... "

మలీ మలీ ఏమిటి ? స్ప్రష్టముగా చెప్పుము ! నీ పేరేమిటోయీ ?

మలీ మలీ అండీ, నేను మా మాత పంపగా వచ్చినానండీ !

శ్యామలీయం మాష్టారు గారు అబ్బురు పడి పోయారు. ! ఈ బాలుడు మాత అన్న పదమును ఎంత స్వచ్చముగా స్వేచ్చెగా పలికినాడు సుమీ ! ఈ మమ్మీ ల కాలములో వీడు మాత అని పలకటం గొప్ప విషయమే !

వారు ఈ మారు కొంత స్వాంతన స్వరముతో బాలకా, నీ పేరు ఏమి ? అని నిదానముగా అడిగినారు

నా పేలండీ , నా పేలండీ, ...

ఓహో ఈ బాలకునికి సాధు రేఫములు పలకడం కష్టమైనట్టున్నది ! అని భావించి శ్యామలీయం వారు, పోనీ, మనమే వేరు విధముగా అడిగి చూతము అని,

బాలకా, నీ నామమేమి ? అని రేఫములు లేక సాధు గా అడిగారు ఈ మారు .

మీలు పెద్ద వాలండీ, నామమేమి అనకూడదు. నీ నామమెక్కడ అని అడగ వలె ! నా నెత్తిపై వున్నది చూడుడు , అని ఒక చెణుకు మన బుజ్జి పండు వేసి,

స్వామీ, నా నామము బుజ్జి పండు అని తనను పరిచయము చేసుకున్నాడు.

హార్నీ, బుజ్జి పండు , ఏమి ఈ తెలుగు పేరు ! ఈ కాలములో పిల్లలకి ఇంత మంచి స్వచ్చమైన పెరెట్టిన తల్లులు గారు వున్నందువల్లే కదా, ఈ శంకరాభరణము వంటి కొలువులు ఇంకనూ వర్దిల్లుచున్నవని వారు సంతోషపడి,

బుజ్జి పండూ, నీ చెణుకు కి నేను మైమరిచితిని.  నీ విక్కడి కి వచ్చిన కారణం బెద్ది ? అని వారు ప్రశ్నించారు.

"మా మాత, జ్యోతిల్మాయీ వాలు, నన్ను మలింత తెలుగు నేల్చుకొనుటకు మీ శంకలాభలనము కొలువుకి నన్ను పంపినాలు మా మాత నన్ను అమలికా నిండి ఇక్కడి కి పంపించినాలు మీ వద్ద అంతల్జాల వాసము చేయమని ' అన్నాడు బుజ్జి పండు.

శ్యామలీయం మాష్టారు, ఈ అబ్బాయి ని గాంచి ముచ్చట పడి, వీడికి ఒక్క రేఫమే కదా సమస్య ! ఈ తెలుగు లోకం లో ఎంత మందికి అసలు తెలుగే రాదు. అటువంటి కాలములో వున్న ఎందరికో కన్నా, ఈ బుడతడి ఉత్సుకతకి ఆ రేఫలోపము ( ఇది దుష్ట సమాసమా అని రేపు ప్రశ్న టపా లో వేయవలెనని గుర్తు పెట్టుకుని ) ఒక్కటే కదా, మన్నించి, శంకరాభరణం కొలువలో ఈ బుడతడికి ప్రవేశము కలిపించి ఈ బుజ్జి పండుకి తెలుగు నేల్పుదము ( హమ్మో, నాకు రేఫలోపము వస్తున్నదే సుమీ!, జాగ్రత్త గా వుండవలె అని మనస్సులో అనుకున్న వారై) అని తీర్మానించి,

బాలకా, బుజ్జి పండు, వేచి వుండుము, నేను సభా ప్రాంగణములో మా పండితుల వారి అనుమతి గైకొని వచ్చి నిన్ను తోడ్కొని పోవుదునని వాక్రుచ్చి, వారు సభా ప్రాంగణంలోనికి వెళ్ళారు.

**********
సభా ప్రాంగణమున బుడతడి గురించి చర్చా ఘట్టము

శ్యామలీయం మాష్టారు సభా ప్రాంగణమున ప్రవేశించి పిడుగు బుడతడి రాక ని కవి పండితాదులకి తెలియజేసారు.

"మన ఈ కవితా ప్రాంగణమున ఆ బుడతడు ఏమి నేర్చుకునును? దీనికి కొంత తెలుగు జ్ఞానము కలిగిన వారై , గ్రాంధికము తెలిసిన వారై వుండిన కదా ఏమైనా వారికి అర్థమగును ? అందులోనూ , బుడతడు అంటున్నారు శ్యామలీయం వారు . అంత చిన్న పిల్లవాడు మనతో ఎలా సంభాషించ గలడు ?" అన్న పండిత నేమాని వారి పృచ్చ తో సభా ప్రాంగణమున కలకలము, మంచి విషయము చర్చకు వచ్చినది అన్న సంతోషము వారిలో కలిగినది.

ఈ ప్రశ్న కి స్వయముగా సమాధానము జెప్పక ఎప్పటి వలె శంకరార్యులవారు అష్ట దిగ్గజముల వైపును, మీదు మిక్కిలి పండిత లోకమును గాన్చినారు చిరునగవుతో , మీ సమాధానం ఏమిటి జెప్పుడు అన్నట్లు. ! ఆర్యులవారు ఎప్పుడు తమ అభిప్రాయమును మొదటే జెప్పరు. అది వారి సొబగు. అప్పుడే కదా కవితా లోకమున ఇంద్రధనుస్సులు వెల్లి విరియును !

లక్కాకుల వారు వెంటనే లేచి, 'అయ్యలారా, మనం ఇంతగా సంకోచించ రాదు. మనము వృద్ధులమై పోతున్నాము. ఈ సభ మనతో నే ముగిసి పోవలెయునా ? నది పారును. తటాకము ఒక్క చోటే ఉండును. మనము తటాకం వలె ఒక్కరై ఉన్నాము. మనము నదియై పారవలె. అప్పుడే కదా ఈ కవితా లోకము అభివృద్ధి చెందును ? కాల ఘట్టములో చూడుడు, నదీ ప్రవాహక ప్రదేశములలో నే కదా జన జీవనము ? కావున నా అభిప్రాయం , మనము నదియై పారవలె. మనతో బాటు చిన్న కాలువలు రావచ్చును. అవి కొంత కాలం తరువాత మనలో కలసి, ఆవియును నదియై , మహానదియై రాబోవు కాలమునకు స్ఫూర్తి నిచ్చును " అని భావవేశాముతో తమ నిర్దుష్ట అభిప్రాయమును తెలియ జేసినారు.

ఈ మారు శ్యామలీయం వారికి 'భేషో లక్కాకుల మాష్టారు' అని మొదటి మారు అనాలన్న సంతోషము గలిగినది. తన మనసున వున్న మాటయే వారు కూడా అనేయటం తో వారికి ఇక బ్లాగ్కామెంటు ఇవ్వటం కుదరక శ్యామలీయం వారు లక్కాకులవారికి బ్లాగ్కామ్ప్లిమెంటు ఇచ్చి ముసి ముసి నవ్వులతో తమ ఆనందాన్ని తెలియ జేశారు.

ఇక మిగిలిన మాష్టార్లు , ఓ మోస్తరు గా , తమ అభిప్రాయమును లక్కాకుల వారి వలె తెలియజేసారు, తమదైన స్వంత శైలి లో.


రాజేశ్వరీ అక్కయ్య గారికి మొదటి మారు సంతోషం వేసినది. ఇప్పటిదాకా అందరు పెద్ద మనుషల సాంగత్యం తో తన చిలిపిదనం కట్టి బెట్టి కొంత గంభీరం గా ఉండవలసి వచ్చె. ఈ బుడతడి రాకతో వారి మాతృ హృదయము కొంత ఊరట జెందినది.

పండిత నేమాని వారు ముసి ముసి నవ్వులతో, మొత్తం చర్చని గమనించి,


'ఆర్యులారా, నేనలా మొదటే అనడం వల్ల మన చర్చా కార్యక్రమము రమ్యముగా జరిగినది. గురువు గా తమ మొదటి కర్తవ్యం శిష్యులలో ఉత్సుకతతని నెలకొల్పటం ! ఆ కర్తవ్యమును నేను సరిగ్గా నెరపినానని భావిస్తాను ! ఇక మనం శంకరార్యులవారి అభిప్రాయమును తెలుసు కొందుము ' అని ఆర్యులవైపు చూసారు వారు.

శంకరార్యులవారేమైనా తక్కువ వారా ? నాలుగు పదుల సంవత్సరం అధ్యాపక వ్రత్తి ని కడు రమ్యముగా గావిన్చినవారు. వారు అవుననీ కాదనీ అనకుండా , ఎప్పటి వలె,


' ఆర్యులారా, మనం ఏదైనాను సమస్యా పూరణము ద్వారానే కదా అన్నిటికి పరిష్కారము గావించెదం? కావున ఈ బుడతడికి కూడా ఒక ప్రశ్న ఇచ్చెదము . వాడు దానికి జెప్పు జవాబు బట్టి మనము తీర్మానించ వచ్చును ' అని శ్యామలీయం వారి వైపు తిరిగి, ' శ్యామలరావు గారు, ఆ బాలకుడు జెప్పినది ఏమి ? తన మాత మాట గా వచ్చితి నని కదా ? " అన్నారు

' అవును ఆర్యా' అన్నారు శ్యామలీయం మాష్టారు. ' ఇందులో ఏదైనా వేరే సూక్ష్మము ఏదైనా ఉందా ' అని ఆలోచిస్తూ.

'కావున ఆ బాలకునికి, వారి మాత గురించి జెప్పుమని ఒక ప్రశ్న వేసెదము. వాడు దానికి ఏమి జేప్పునో దానిని బట్టి మనము ఆతనికి సభా ప్రవేశము ను ఇచ్చుట యో లేక తిప్పి పంపి వేయుటాయో జేసెదము!' అని ఆర్యులవారు జెప్పారు.

అష్టదిగ్గజములు ఎప్పటి వలె దీనికియునూ తలయూపి, శ్యామలీయం మాష్టారు వైపు జూసినారు.

శ్యామలీయం వారు, 'నెమిలి' యై చెంగున ఎగిరి, బుజ్జి పండుని తమ మూపురము పై నిడుకుని సభా ప్రాంగణమున తిరిగ రాగా, ఆ షణ్ముఖు డే వచ్చాడా అన్నంత గా ఆ సభా ప్రాంగణము దివ్య కాంతులతో ప్రజ్వరిల్లినది.

**********


శ్యామలీయమైన నెమిలి పై నుంచి బుజ్జి పండు నిదానముగా దిగాడు.

ఆతన్ని జూసి సభా స్థలి అచ్చెరువొందినది. బుడతడి ముఖమున ఏదియో తెలియరాని జ్యోతి (ఆ మాత జ్యోతిర్మయీ మహత్వమేమో ?) ప్రస్ఫుటిస్తోంది.

ఇది అని చెప్ప నలవి కానిది.

షణ్ముఖుడు పంచకక్షం కట్టినవాడు.

ఈ బుడతడు జీన్స్ ప్యాంటు పై టీ షర్టు ధారి యై వున్నాడు. కంటికి హారీ పాటర్ అద్దములు కూడాను. నెత్తి పై నామము. కాలికి నైకే షూస్.

షణ్ముఖుడు వేలాధయుడు. ఈ బుడతడు శర్కరీ ధారీ.


ఒక చేత శర్కరీ , మరియొక్క చేత అంకోపరుండై వున్నాడు వీడు.

బుజ్జి పండు సభా స్థలి కి ప్రణమిల్లి ,

"సభ యందు వెలసిల్లిన పెద్దలన్దలికీ నా నమస్కాలములు ! నా పేలు బుజ్జి పండు , నేను మీ చెంత తెలుగు నేల్చు కొనవలె నని మా మాత ఆదేశానుసాలముగా ఇచ్చటికి వచ్చితిని " అని,

రాజేశ్వరీ అక్కయ్య వారి వైపు తిరిగి , " నమో మాతా , నమో నమః ! పెద్దమ్మ వాలికి నమస్సులు " అని 'స్పెషల్' గా నమస్కరించడం తో రాజేశ్వరీ అక్కయ్య వారు తబ్బి మొబ్బిబై

"రారార కన్నయ్య , రార వరాల పంట, రారార గారాల పట్టి ,తెలుగు నేర్వంగ " అని మురిసి పోయింది.

సభాస్థలి బుడతడి వైపు ఒక్క మారు , రాజేశ్వరీ అక్కయ్య వైపు ఒక్కమరూ చూసింది.

ఈ మాతలు ఎల్లప్పుడూ వెన్నె హృదయులే సుమా అని అచ్చెరువొంది న వారు, వీరు వెన్నపూసై కరిగి పోవడానికి అర నిముషము చాలు సుమా అని తీర్మానించు కున్నారు.

బుజ్జి పండు ఈ మారు శంకరార్యులవైపు తిరిగి నమస్కరించి,

"అందమగు బ్లాగు నిలిపిలి యందలి
హ్లుదయముల నిలిచి యానందము
పెంపొందిచిన గులువు గాలికి
నమస్సులు కవివల , జేజే"

అని సాదర ప్రణామము గావించాడు.

ఈ మారు శంకరార్యుల వారికి సందేహం వేసింది, " ఈ బుడతడు, మరీ తన బ్లాగు మొత్తం పరిపూర్ణముగా శోధించి వచ్చి వున్నాడేమో సుమీ " అని సందేహ పడిన వారై చిరునగవు ఒకటి నొసగి పండిత నేమాని వారి వైపు జూసినారు, ఆర్యా మీరు ప్రశ్నింపుడు బాలకుడిని అన్న చందాన.

పండిత నేమాని వారు, ఔరా , ఈ శంకరార్యుల వారి చాతుర్యమే చాతుర్యం - అన్నిటికీ నన్నే ముందు వుండమనటం అనుకుని,

ప్రకాశాముగా " బాలకా, నీవు ఇచ్చట తెలుగు నేర్చుకొనుటకు మీ మాత పంపగా వచ్చినావని మా శ్యామలీయం మాష్టారు జెప్పారు. మంచి ప్రయత్నమే. కానీ వచ్చినవాడివి ఎటువంటి వ్రాత పుస్తకములు లేకుండా వచ్చి నావే" అని ధర్మ సందేహం లేపారు.

అసలు బాలకా నీవు నిజంగానే నేర్వడానికి వచ్చినావా అని వారు నేరుగా అడిగి ఉండవచ్చు. కాని సూక్ష్మం గా వారు ఈ లా ప్రశ్నించారు. అది వారి చాతుర్యం.

బుజ్జి పండు తడుము కోకుండా టపీ మని,

" అయ్యా పండిత నేమానీ గులువా - హస్తభూషణముగ అంకోపలుండగా పుస్తకం బదేల హస్తమందు?" అని చిరు నగవుతో జెప్పి "అయ్యా చేత మా మాత నొసంగిన 'శల్కలీ ' సహిత ఇచ్చట వచ్చి వున్నాను ' అన్నాడు.

ఈ బాలకుడి రేఫమును ఎటుల సరి దిద్ద వలె నని శ్యామలీయం మాష్టారు తీవ్రముగా ఈ మారు చింతించడం మొదలెట్టారు.

" ఆర్యా, పండిత నేమాని వారు , ఆ బుడతడు శర్కరీ అన్న పదాన్ని అలా 'శల్కలీ' అన్నాడు. రేఫాలోపము అంతే.  ఒక చిన్న సందేహము నాకు ఇది దుష్ట సమాసమేమో " అన్నారు శ్యామలీయం వారు - నానాటికీ తీసికట్టు నాగంభట్లు అయిపోతున్నానే సుమీ అని కొంత నివ్వెర పడుతూ.

ఆ రేఫా లోపమును మీరి ఆ బుడతడు జెప్పిన సమాధానమునకు పండిత నేమాని వారు సంతసించి,

" శ్యామలీయం మాస్టారు, మీ సందేహ నివృత్తి వేరుగా చర్చించ దెము , ముందు ఈ బుడతడి సమాధానం మాకు బాగుగా నచ్చినది " అని ఆప్యాయముగా తన మనవణ్ణి జూసినంత గా బుజ్జి పండుని గాంచి నారు పండిత నేమాని వారు. మనవళ్ళ వయసులో వున్న పిల్లలని గాంచిన తాత గార్లకు ఎల్లప్పుడూ సంతోషదాయకమవడం ప్రకృతి సహజ మే గదా!

పండిత నేమానీ వారు ఇంత శీఘ్రం గా కరిగి పోతారని అనుకోని గోలీ వారు దీర్ఘముగా బుడతడు బుజ్జి పండు ని గాంచి,

"నాయనా బుజ్జి పండు.. నీ ఇచ్చుకని మేము మేచ్చితిమి. అయినన్ను , మీ మాత మాట మీదుగా ఇచ్చటికి వచ్చి నాడవని అంటున్నావు. మరి మీ మాత గురించి నీకు తెలిసిన ఒక పద్యము జెప్పుము అని ఒక బాణాన్ని ఎక్కు పెట్టారు సూటిగా.

గోలీ వారు వారు పేరు కు తగ్గట్టు గోళీ సూటిగా వేయుదురు -వారు, మధురమైన పద్యము ముందు  "తేనె రుచిని జూడ తీయదనము లేదు - పటిక బెల్లమందు పసయె లేదు - చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు" అని అంతర్జాల పథముగా నొక్కి వక్కాణించినవారు కూడాను!

ఇలా సూటిగా గోలీ వారు బుజ్జిపండు ని బరిలోకి లాగడం తో , సభాస్థలి బుజ్జి పండు ఏమి జెప్పునో అని కుతూహల పడి ఆతురతతో బుడతడిని గాంచినది !

బుడతడు నిదానముగా సభా స్థలి ని కలయ జూసి, పండిత గోలీ శాస్త్రు లవారి కి ప్రణామం బులు వొనరించినాడు .
**********

గులువులు హనుమచ్చాస్లీ గాలికి నమస్సులు.

" అజాడ్యం వాక్ పటుత్వం చ హనూమత్ స్మలనాత్ భవేత్ " అని మా మాత చెప్పాలు. మీలు వాలి నామధేయులు. కావున మీ స్మలణతో మా మాత గులించి చెబుతాను -

"నడకలు నేల్పెను
నడవడికలు నేల్పెను
నడతను నేల్పెను
బుడి బుడి నడకల
బుజ్జి పండు
బుద్ధుడే అవుగాక ! అని మా మాత నాకు అన్నియు నేల్పెను" అన్నాడు బుజ్జి పండు.

గోలి వారికి ఈ బుడతడు హనూమంతుడు కన్న రాముడే అయ్యాడు ఆ బుజ్జి పలుకులు విని.

ఈ మారు చింతా వారు, 'ఈ గోలీ వారూ బోల్తా పడ్డారే సుమీ ' అని బుజ్జి పండు ని వుద్దేశించి,

" బుజ్జి పండు - అమెరికా దేశములో తెలుగు నేర్చుకొనుటకు ఎన్నో పుస్తకములు వున్నాయి కదా ? వాటితోనే నీవు నేర్చుకోవచ్చు గదా ? ఇలా శంకరాభరణం కొలువు లో అంతర్జాల వాసం అవరసరమా ? " అని బుజ్జి పండుని 'పరి' శోధించారు!

దానికి బుడతడు, క్షణ మాత్రములో , "చింతావాలు! మీ వంటి గురువుల మస్తకమును మించునే పుస్తకమ్ము " అని తడుముకోకుండా జవాబు చెప్పాడు.

బుజ్జి పండు అంత వేగం గా తనకు సమాధానము చెప్పునని చింతా వారు ఎదురు చూడ లేదు !

కొంత కాలం మునుపే ఈ శంకరాభరణం సదస్సు 'మస్తకమ్మును మించునే పుస్తకమ్ము ' అని ఘంటా పధం గా ఘోషించింది కూడాను! కాబట్టి వేరుగా చెప్పనలవి కాదు !

పండిత నేమాని వారి వైపు సభా సదస్సు చూసింది. శంకరార్యులు కూడా చిరు నవ్వు నవ్వుతూ, ' ఆర్యా ! పండిత నేమానీ సన్యాసీ రావు గారు మీ అభిప్రాయం ? " అన్నారు.

పండిత నేమాని వారు సభను ఉద్దేశించి,

మిత్రులారా!

భాష, పద్య కవిత్వము ఎవరికి అలవడును అని ఒకపరి పరికించుచో -పెద్ద పెద్ద చదువులు కలిగిన వారు ఒక పాదము కూడా చెప్ప లేక పోవచ్చును; సామాన్యులైన వారు చక్కని సహజ కవిత్వముతో జనరంజకమైన కవిత్వమును చెప్ప గలుగుచున్నారు. వాగ్దేవి యొక్క సంపూర్ణ అనుగ్రహము మరియు పూర్వ జన్మల సంస్కారము గలిగిన వారికి పద్య కవిత్వము అబ్బును. ఈ మంచి యోగమును ఈ బాలుడు పొందిన వాడిలా వున్నాడు. మనము ఈతనికి చదువులు నేర్పుతూ ఇంకా ప్రోత్సాహముతో ఈ బుడతడి తెలుగు చదువును ముందుకు సాగానిద్దాము " అన్నారు.

ఈ పలుకులు విని

చింతా వారు ఆనందోత్సాహముతో ,

" వరహృదయమ్మునన్
తెలుగు భాషను చక్కగ నభ్యసించి చాతురి
మెరయన్ కవిత్వమున దొడ్డతనమ్మును
జూపుచున్ సుధీవరుల ప్రశంసలొందు బుజ్జి పండూ" అని ఆశీర్వదించి, నిరతము వృద్ధి చెందుచును నీ కృషి యిచ్చును సత్ఫలమ్ములన్ " అని మెచ్చు కున్నారు కూడాను.

సురా బ్లాగీయం సుబ్బారావు గారికి బుడతడి నడవడిక, నడత, మాటలు చాలా నచ్చాయి. వారు వెంటనే ఆశువుగా



"తల్లి దండ్రుల యందున తల్లి మిన్న
సుతుని బాగోగు లన్నియు చూచు చుండి
కంటికిని రెప్ప యట్లయి కాచు చుండు
దైవ మున్న దె ? సుతునకు తల్లి కంటె ? "

అని బుజ్జి పండు మాతని కొనియాడి, బుజ్జి పండుని మనసారా ఆశీర్వదించారు !

శంకరార్యులవారు, సభనుద్దేశించి,

"మన భాషా పండితులు అందరూ కూడా అంకిత భావంతో భాషాభిమానంతో భాషాసేవ చేస్తూ తమను నమ్మి తమదగ్గర విద్యకొఱకు వచ్చే విద్యార్థులకు ధర్మ బద్ధంగా విద్య గరుపుతూ ఆంధ్రవిద్యార్థులకు ఆంధ్ర భాషాభిమానం పెరిగేలా చేయాలన్న కోరికతో ఉన్నవారే ! వారు గురుతరమైన గురువు భాద్యతలను నెరవేర్చి, బుడతడైన బుజ్జి పండుని తమ తమ విధానాల మూలముగా తమ శిష్యునిగా చేసుకోవటం నాకు చాలా సంతోషాన్ని కలుగ జేస్తున్నది.  


తెలుగు వారంత కలసిన వెలుగు బాట , మలచి పూయించి వచ్చు మావి తోట ! తెలుగు వారన్న వెలుగుల జిలుగు వారు , యెచట నున్నను గెలుపొందు రచటె వారు!

కాబట్టి ఈ బుడతడైన బుజ్జి పండుకి మన సభా ప్రాంగణమున మనము మరింత తెలుగు నేర్చుకొనుటకు, మనము ప్రోత్సాహము ఇచ్చెదము.

లక్కాకుల వారు మొదట చెప్పారు- మనము నది అయి ప్రవహించా లని.

మనము జీవ నదులమై ఈ భువి మండలమున తెలుగు వ్యాప్తికై మన వంతు కర్తవ్యం నెరవేర్పుదాము ! ఈ బుజ్జి పండు రాక మన సభా స్థలి కే వన్నె తెచ్చినది. అని చెప్పి బుజ్జి పండు వైపు తిరిగి


"శతమానం భవతి బుజ్జి పండు" అని మనసారా దీవించారు.

ఇందరి గురువుల ఆశీర్వచనములతో బుజ్జి పండు రేఫా లోపమూ మటుమాయమై పోయినది.

శ్యామలీయం వారు, లక్కాకులవారు చేతిలో చేయి వేసి శభాష్ అని భుజాలు తట్టుకున్నారు

రాజేశ్వరీ అక్కయ్య గారి గురించి చెప్ప వలెనా ?

"చిన్న నాటను చేయగ చిలిపి పనులు , తల్లి చాటున ముద్దుల తనయు డనగ, ఈ బుజ్జి పండు ఎదుగ వలె జగద్గురు వనంగ" అని మనసారా కోరుకున్నారు వారు.




సభా స్థలి లో గణ గణ గంట మోగింది.
బుజ్జి పండు ఆశువుగా అందుకున్నాడు. 

గదిని గోడకున్న గడియారమున గంట,
చర్చి గంట, పాఠశాల గంట,
గిత్త మెడను గంట,కేశవు గుడి గంట,
టంట, టంట, టంట, టంట, టంట. !!!
శ్రీ పతి వారు సంఘ సూక్తం తో  ముగించారు
సమానో మంత్రః సమితిహ్ సమాని
సమానం మనః సహ చిత్తమేషామ్
సమానం మంత్ర మభి మంత్ర ఎవః
సమానేన వో హవిషా జుహోమి
సమాని వ ఆకూతిహి
సమానా హృదయానివః
సమానమస్తు ఓ మనో
యథా వః సు సహా సతే !!!


ఇంతటి తో బుజ్జి పండు తెలుగు చదువు -  శ్రీ శంకర విజయం అను అంకము సమాప్తము.


బుజ్జి పండు శంకరాభరణ కొలువులో తెలుగు పరి పూర్ణముగా నేర్చుకుని, తిరుగు దారి అమెరికా కి పట్టాడు.

మధ్య దారిలో ఆతని విమానము ఫ్లైట్ లే ఓవర్ లో , జర్మెనీ దేశంలో ఫ్రాన్క్ఫర్టు అంతర్జాతీయ విమానాశ్రయం లో  ఆగింది. లే ఓవర్ సమయం లో బుజ్జి పండు కునుకు తీస్తూండగా 'కిడ్' నాప్ కాబడి నాడు. !

దీనికి మూల కారకులు కొందరు భామలు. వారిలో సూత్రధారి అయినవారు మధుర వాణీ గారు -  జర్మనీ వాసులు.

 
వారు 'ఈ' కిడ్ - నాప్ ఎందుకు చేసారు ?
దాని కథా కమామీషు ఏమిటి ? రాబోవు అంకము- బుజ్జి పండు తెలుగు చదువు - భామా విజయం కై వేచి చూడుడు.!

Friday, November 18, 2011

దీపావళీయం - ఓ "ఫన్ ఆర్ట్" విత్ జే కే- బులుసు సుబ్రహ్మణ్యం గారితో బ్లాగ్ముఖీ

బ్లాగ్ లోకానికి దీపావళి శుభాకాంక్షలతో - మీ జిలేబి సమర్పించు

ఓ "ఫన్ ఆర్ట్" విత్ జే కే


బ్లాగ్ముఖి  

ముఖాముఖి విత్ బ్లాగర్ 'బులుసు సుబ్రహ్మణ్యం'
(నవ్వితే నవ్వండి - వారి బ్లాగ్)




నమస్కారంబులు సుబాల సుబ్రహ్మణ్యం గారూ!




హతోస్మి ! నా పేరుకి మరో కలికి తురాయి !


మీ పరిచయం ?


హిహిహి నేనే.
రీజినల్ రీసెర్చి లెబోరేటరీ, జోర్హాట్ లో సైంటిస్ట్ గా పనిచేసాను. ఇప్పుడు 'Retyred'!



మీ పేరు కి మరో కలికి తురాయి అన్నారు ఎందుకు ?

వీరి వీరి గుమ్మడి ప౦డు వీరి పేరేమి ? పేరులో  ఏము౦ది అని తీసిపారే్సేవారు చాలామ౦ది అయితే, పేరులోనే పెన్నిధి ఉ౦ది అని నమ్మేవాళ్ళలో నేనొకడిని. సుబ్రహ్మణ్య౦ అని స రి గ్గా నోరారా ఎవరైనా పిలిస్తే పలకాలని ఒకకోరిక..


ఇ౦ట్లో సాధారణ౦గా ఒరేయ్ సుబ్బిగాఅని, ఎప్పుడైనా కొ౦చె౦ ప్రేమగా సుబ్బయ్యా అనో పిలిచేవారు.


ఆనర్సు చివరి స౦వత్సర౦లో ఒక చైనీయుడు ఇ౦గ్లీషులో పి.జి. చెయ్యడానికి వచ్చాడు.వాడు ఇ౦గ్లీషు ప్రొనౌన్సియేషన్ కి నానా త౦టాలు పడే వాడు.మహా దుర్మార్గుడైన మా మిత్రుడొకడు వాడికో సలహా పాడేసాడు. నాపేరు స్పష్ట౦గా పలకగలిగితే ఏ భాషనైనా సరిగ్గా ఉచ్చరి౦చ వచ్చును అని.


ఓ సాయ౦కాలము సమావేశ౦ ఏర్పాటు చేసాడు.వాడు ఉత్సాహ౦గా నా నామస్మరణ మొదలు పెట్టేడు. ’సు’ ని ’శు’ ని ఒకదాని మీద ఒకటి పెట్టి, ’శు’ కి౦ది మెలికని, ’సు’ పైకొమ్ముని ’జు’ తో లాగుతూ కుడికాలుని మడిచి ఎడ౦చేతితో ఒక పెదవిని పైకి లాగుతూ కుడి చేతివేళ్ళతో స్వర పేటిక నొక్కుకు౦టూ ఒక్కమాటుగా నోట్లో౦చి, ముక్కులో౦చి గాలి వదిలాడు.


అస్సా౦లో ఉద్యోగ౦లో ఉన్నప్పుడు నన్ను వివిధ రీతులలో పిలిచేవారు. ఒక మణిపూర్ ఆయన సుభ్ రామ్ అనే వాడు. ఓ బె౦గాలీ బాబు, సుబ్బొరోమొనియామ్ తో మొదలుపెట్టి సుబ్బొరోమ్ కి కత్తిరి౦చేసాడు.


ఇ౦కో కన్నడ సోదరీమణి సుభరమన్య౦ అనేది. బర్ అని, భర్ అని, బొర్ అని ’బ్ర’ ని పెట్టిన పాట్లు ఆహా చెప్పనలవి కాదు. ’హ్మ’ అనే అక్షర౦ నా పేరులో ఉ౦దని నేనే మరచిపోయాను.


చిత్రమైన విషయం ఏమిటంటే సంస్కృతం వచ్చిన త్రిపాఠి లు, చతుర్వేది లు కూడా నా పేరు ముక్కలు చేసేవారు.


బులుసు మాష్టారి అబ్బాయి గా అవతరి౦చి, శ్రీలక్షమ్మగారి భరతగా ఎదిగి, సిరి కా పాపా గా పరిణామ౦ చె౦ది, చివరకు స౦జన తాతగారి లా మిగిలిపోయాను.


ఒక బ్లాగరైతే ఏకం గా నన్ను - "ప్రియమైన సఉబరహమణయమఉ గారికి సాదర ప్రణామములు" అన్నాడు !



 

మీ వయసు ?




చాలా  పురాతనమైన వాడిని.నా వయసు ఇంకా అరవై ఆరే.

 

రిటైర్ అయ్యాక మీరేమి చేస్తున్నారు ?




గత మూడేళ్ళుగా రిటైరయ్యి ఇంట్లో కూర్చున్నప్పటినించీ నేను జ్ఞాని నయిపోతున్నా ఈ మధ్యన తెగ జ్ఞానం సంపాదించేస్తున్నానేమోనని అనుమానం డౌటు కలిగింది. ఎడా పెడా, కుడీ ఎడమా, రెండు చేతుల తోటీ జ్ఞానం అర్జించేస్తున్నానని నమ్మకం కూడా కలిగిపోతోంది.


ఇంత జ్ఞానం ఇల్లా సంపాయించేస్తుంటే బ్రహ్మజ్ఞానిని అయిపోతున్నానేమోనని అనుమానం వచ్చేస్తోంది.


 మొన్నోకల కూడా వచ్చింది. బాసింపట్టు వేసుకొని, కళ్ళు తెరిచి నేను తపస్సు చేసుకుంటున్నాను. రెండు కళ్ళకి ఎదురుగా రెండు టీ.వీ లు, చెరోపక్కా రెండు చెవులకి ఇంకో రెండు టీ.వీ లు (చెవులకి టీవీ లు ఎందుకు? రేడియో చాలదా అని ప్రశ్నలు వేయకండి.నా కల, నా ఇష్టం)



 

మీ శ్రీమతి గురించి .... ?


కొంతమందికి ఊత పదాలుంటాయి. కాని మాఆవిడకి ఊతవాక్యాలే ఉన్నాయి. నో పదమ్సు, ఓన్లీ వాక్యమ్స్ అన్నమాట.


పెళ్ళికి ముందు మాఆవిడ నాఫొటో చూసింది కాని నాకు ఆభాగ్యం కూడా కలుగలేదు.నో పెళ్ళిచూపులు. మారేజి లుక్స్ పెళ్ళిలో తెరతీసిన తర్వాతే నన్నమాట.


“ మీ మొహం, మీకేం తెలుసండి” అని. ఇవి మాఆవిడ నాతో మాట్లాడిన మొదటి మాటలు, ప్రేమ సంభాషణ, తొలి పలుకులు, లవ్ నతింగ్స్, మొహబ్బతికి బాతేం.


“మీర జాల గలడా నాయానతి సతీ ద్రౌపదీ పాక మహిమన్” అని పాడు కుంటూ పొద్దుటి నించి నన్ను తిండి పోతు ని చేసి నీరసం వచ్చేలా చేసిందంటే నమ్మండి !


భరించువాడు భర్త అంటారు. కాబట్టి ఆవిడ ఏమన్నా భరించక తప్పుతుందా. పెళ్ళైన తర్వాత ఆడువారికి జ్ఞానం పెరుగును, మగవారికి తరుగును అని ఓ సన్యాసి నాకు  చెప్పాడు.



 

మీ ఆవిడ చేసే తప్పులకి మీరెలా స్పందిస్తారు ?

 

సాధారణంగా మాఆవిడ చేసే తప్పులు రోజుకి నాల్గైదు అయితే క్షమించేస్తాను. అంతకు మించితే ఆగ్రహిస్తాను. ఆగ్రహించి చేసేదేమీ లేదు కనక ఇల్లాంటి రోజులు నాలుగు లెఖ్ఖ పెట్టుతాను. మరుసటి రోజున మౌన నిరసన వ్రతం చేస్తాను. ఎదో విదంగా మరి నా అసమ్మతి తెలియచెయ్యాలి గదా. ఉద్యమిస్తే పోయేది భార్య కాదు. ఆమె చేతిలో మన మానప్రాణాలు!

 

ఆహా భార్యావిధేయుడనని చెప్పుకుంటూ, ఆవిడ మీద వ్యంగ టపాలు రాస్తారని పురుషహంకార ఆభిజాత్య కుట్రలు.?

 

ప్లీజ్ మాఅత్తగారికి, మాఆవిడకి అసలు చెప్పకండి. పెద్దవాడిని ఉపవాసాలు ఉండలేను.






మీ పక్కింటి పంకజాక్షి గురించి నాలుగు ముక్కలు ... ?

 

రిటైర్ అయిన మరుసటి రోజు నేను మృదు మధుర శాంత స్వనంతో మా ఆవిడని ఉద్దేశించి “ దేవీ శ్రీదేవి, ఆర్యపుత్రీ, ఓ కప్పు కాఫీ కావాలి” అని దీనంగా అభ్యర్ధించాను.


 మాఆవిడ విందో లేదో నాకు తెలియదు కాని మా పక్కింటి పంకజాక్షి వినేసింది.


ఆవిడ కు ఉన్న ఏకైక పని మాఇంట్లో దూరదర్శన్, దూరశ్రవణ్ ప్రసారాలను monitor చేసి పున:ప్రసారం చేయడం. నామాట వినడం, వాటికి ఇంకో రెండు విశేషణాలు జోడించి, వాటిని తన మొబైల్ లో SMS చేసెయ్యడం జరిగిపోయింది.


అదేదో వల పని(Net working) ట ఒక నొక్కుతో పాతిక మందికి పంపవచ్చుట.


ఈవిడ మూడు నాలుగు నొక్కులు నొక్కిందనుకుంటాను. అంతేకాదు లాండ్ లైను, మొబైలు ఉపయోగించి ఇంకో అంతమంది కి ’అడక్కుండానే సమాచారం మీచెవిలో’ స్కీము లో ప్రసారం చేసేసింది.


ఒక పావు గంటలో ’ఆల్ నెట్ వర్క్స్ ఆర్ బిజి’ అయిపోయాయి. మా ఆవిడ మొబైలు వెరీబిజి. SMS లు శరవేగంతో వచ్చేసాయి. నా పాట్లు ఇంకా చెప్పాలంటారా ?

 

బుద్ధి, జ్ఞానం మీద మీరు రిసెర్చ్ చేసారట ?

 

బుద్ధి, జ్ఞా న౦ మీద మాస్నేహితుల౦దర౦ చాలా తీవ్ర౦గా పరిశోధనలు చేసా౦.


ఎదురి౦టిలో పరికిణి, జాకెట్టు వేసుకుని తిరిగేది అమ్మాయి అని తెలుసుకోవడ౦ బుద్ధిఅని, ఆఅమ్మాయి జోలికి వెళ్తే పళ్ళు రాలతాయని తెలుసుకోవడ౦ జ్ఞా న౦ అని.


ఆ తర్వాత ఈవిషయ౦లో నేను సమగ్ర పరిశోధన చేసి, యూనివర్సిటి వదిలేటప్పటికి వెధవ పనులు ఎలా చేయడమో్ తెలుసుకోవడ౦ బుధ్దిఅని, ఆపై తిట్లు, తన్నులు తప్పి౦చుకోవడ౦ జ్ఞా న౦ అని కనిపెట్టాను.


ఉద్యోగ౦లో చేరి౦తర్వాత పని చేయకు౦డా తప్పి౦చు కోవడ౦ బుద్ధి అని, అ౦తా మనమే చేసినట్టు కనిపి౦చడ౦
జ్ఞా న౦ అని నిర్ధారణకు వచ్చేసాను.


ఏమీ తెలియకపోయినా అ౦తా తెలిసినట్లు ఎదుటివారిని నమ్మి౦చడ౦ జ్ఞానానికి పరాకాష్ట అని గ్రహి౦చాను.



 

మీకు జ్యోతిష్యం మీద నోబెల్ బహుమతి వస్తోందటగా?

 

జ్యోతిషం మీద కాక పోయినా, బొందాక్సైడ్ మీద చచ్చేటట్టు పరిశోధనలు చేసినందుకు, నోబులు బహుమతి వచ్చేస్తోంది.

 

తెలుగు మీద, మీ మాస్టర్ల మీద మీ అభిప్రాయం ?

 

తెలుగుమీద ఇప్పుడు బోలెడు అభిమానం ఉన్నా, చిన్నప్పుడు తెలుగంటే నాకు చాలా భయం ఉండేది. మా మాష్టార్లు, ఒకరిద్దరు తప్పితే, మాకు టిఫిన్లు బాగా పెట్టేవారు. పెసరట్టు, మినపరోస్ట్ వీపుమీద, కొంచెం లైట్ గాపడితే పెసరట్టు, అరచేతి ముద్రలు కూడా ముద్రిస్తే మినపరోస్ట్ అని అర్ధం. తొడమీద గిల్లితే పకోడి అనీ, మెలిపెట్టి గిల్లితే పునుకులు అనీ, బుగ్గమీద పొంగిస్తే బూరెలు అనీ, అరచేయి వెనక్కి తిప్పి ముణుకులు వాయగొడ్తే కజ్జికాయలు, మైసూర్ పాక్ అనీ అనేవాళ్ళం.


క్లాసులో అందరూ ఐన్ స్టీన్ లే ఉండరు. నాలాంటి మిడతంభొట్లుగాళ్ళు కూడా ఉంటారు. మాగురువులు అంటే మాకు అభిమానం, గౌరవం. మాగురువులు మాకు పాఠాలు. నేర్పారు, I repeat, నేర్పారు , అవసరమైతే ఓ దెబ్బవేసి. చదువు దాని ప్రాముఖ్యత గురించి, మా తల్లి తండ్రుల కన్నా మాగురువుగార్లే ఎక్కువగా చెప్పారు. బహుశా వాళ్ళు మామీద అంత శ్రద్ధ తీసుకోక పోతే, ఈనాడు ఈమాత్రమైనా మేము ఎది్గేవారం కాదు..



 

మీది ఒంగోలా? అయితే ఒంగోలు శీను తెలుసా ?

 

నాకు ఒంగోలు గిత్త తెలుసు. దానిపేరు చీను అని తెలియదు,శీను గారి గురించి నాబ్లాగులో ఎందుకు వెతుకుతున్నారో నాకు అర్ధం కావటంలేదు. వారు మీకు త్వరలో దర్శనమివ్వాలని కోరుకుంటున్నాను.

 

మీ జీవితం లో ముఖ్యమైన రెండో మనిషి ?

 

నాజీవితంలో ముఖ్యమైన రెండో మనిషి, ఎప్పుడూ నన్ను విమర్శించే మా బాసు గారు, ఏపనీ సరిగ్గా చేయవేమోయి శంభులింగం అనీ, అసలు నీకు చేతనైన పని ఏదైనా ఉందా శంకరనారాయణా అనీ, నాకు అధికారాలు లేవుకానీ, ఉంటే నీకెప్పుడో ఉద్వాసన చెప్పేసేవాడిని సింహాచలం అనీ, అనేవాడు. నా ప్రమోషను కాగితం పట్టుకొని, పదిహేనేళ్ళు ఒకే సీట్లో కూర్చున్నవాళ్ళందరికి ఇవ్వాలని రూలుండబట్టి నీకు ఇవ్వాల్సివచ్చింది భజగోవిందం అని విచారించాడు. నన్ను ఎవరూ ఆదర్శంగా తీసుకోకూడదని మనస్ఫూర్తిగా దేవుడిని ప్రార్ధించి, రెండు నిముషాలు మౌనం పాటించి మరీ ప్రమోషను ఆర్డరు చేతికి ఇచ్చాడు.


మీరు ఎప్పుడు బ్లాగటం మొదలెట్టారు ?


జూన్ 12, 2010 న బ్లాగు మొదలు పెట్టాను. 14 న మొదటి టపా వేశాను. సంకలినులు ఉన్నాయని అప్పుడు తెలియదు. రెండు టపాలు వేసిం తరువాత  జూలై 1 న కూడలి లో చేర్చాను.  ఆ తరువాత మాలిక, జల్లెడ లలో చేర్చాను  15-20  రోజుల  తరువాత. హారం లో నా బ్లాగు లేటు గా చేర్చాను.  8  టపాల తరువాత అనుకుంటాను.  అన్ని సంకలినుల నిర్వాహకులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.  నా బ్లాగులో మొదటి కామెంటు    శ్రీలలిత గారు  పెట్టారు. 21 టపాలకీ సుమారు గా 570 కామెంట్లు వచ్చాయి.  శ్రీలలిత  గార్కి  హృదయ పూర్వక  ధన్యవాదాలు చెప్పుతున్నాను.  నా మొదటి టపాకు  ఒకే ఒక్క కామెంటు  తార గారిది.  మొదట్లో  బ్లాగుల గురించి అంతో ఇంతో నేను తెలుసుకున్నది తార గారి ద్వారానే. వారికి నా కృతజ్ఙతా పూర్వక ధన్యవాదాలు.  కామెంట్లు పెట్టిన వారందరికి హృదయపూర్వక కృతజ్ఙతాభి వందనములు.




అదేమీ పేరు బ్లాగుకి - నవ్వితే నవ్వండి అని ?

మీరంతా నవ్వుతారా, నవ్వి పోతారా, ముత్యాలు దొర్లిస్తారా, లేదా అనే నా  ఆదుర్దా నాది. నా హాస్య చతురత సామాన్యమే. మీ అందరి అభిమానమే నాకు శ్రీరామ రక్ష.



మిమ్మల్ని లేపెస్తామన్నవాళ్ళూ, కిడ్నేప్ చేస్తామన్న వాళ్ళూ ఉన్నారంట ?

నన్ను లేపేస్తానన్నవారు ముగ్గురు నలుగురు ఉన్నారు. గీతాంజలి లో లాగైనా లే...చి..పో..దా..మా. అన్న వారూ ఉన్నారూ  సంతోషం, అల్లాగే తప్పకుండా. కానీ ఒక చిన్న చిక్కు ఉంది. నాది కొంచెం భారీ శరీరం. దాన్ని లేపాలంటే ఓ crane కావాలి. అది పట్టుకొచ్చారంటే నన్ను లేపుకుపోవచ్చు.


అయినా నన్ను కిడ్నాప్ చెయ్యడానికి ముఠాలు, ప్రణాళికలు, అనవసర హైరానా ఎందుకు. ఎక్కడికి రమ్మంటే అక్కడికి నేనే వచ్చేస్తాను. కానీ మళ్ళీ నన్ను వదుల్చుకోవాలంటే కొన్ని లక్షలు ఖర్చు అవుతాయి మరి. జాగ్రత్త.




మీ టపాలు చదివి మలక్పేట్ రౌడీ లాంటి వాళ్ళే భయపడ్డారట !?

 

ఎంత పోరినా, హత్యలు చేసినా, ఎంత రౌడీ అయినా, భార్యా బాధితుడే కదండీ మరీ !

 

మీరు పరభాషా చిత్రాలు చూస్తారా ?

 

నేను జోర్హాట్ లో ఉద్యోగంలో చేరిన కొత్తలో ఓ ఆదివారం, తెల్లవారు జామున అంటే సుమారు 8.30గం మా సమరేంద్ర నాధ్ సేన్ గారు భళ్ళున తలుపు తోసుకొని వచ్చి నన్ను కంగారు పెట్టేసాడు. లే లే ఇంకా పడుకున్నావా. టైము అయిపోతోంది అంటూ. విషయం అర్ధం కాకపోయినా నేను తయారయి రాగానే నన్ను సైకిలు మీద ముందు కూర్చోపెట్టి రయ్ రయ్ మని రొప్పుతూ రోజుతూ తొక్కేస్తున్నాడు.


నేను ఎక్కడికి అనగానే ముయ్ నోరు అన్నాడు. నేను నోటితో పాటు కళ్ళు కూడా మూసుకొన్నాను. కళ్ళు తెరిచి చూసేటప్పటికి నేనో సినిమా హాల్లో సుఖాసీనుడనై ఉన్నాను. సరిగ్గా టైము కి వచ్చామని సేను గారు ఆనం దించి నన్ను కూడా దించమన్నాడు.


తెర మీద మనకి అర్ధం కాని భాషలో, అక్షరాలో, అంకెలో కూడా తెలియకుండా వచ్చేసి, సినీమా మొదలై పోయింది. ఏమీ అర్ధం కావటం లేదు. అయినా అల్లాగే చూస్తున్నాను


ఓపది నిముషాల తర్వాత సినిమాలో ఓ కాకి వచ్చింది. కావ్, కావ్, కావ్, కావ్ మని నాలుగు మార్లు కావుమంది. మా సేనుడు వహ్వా, వహ్వా అన్నాడు. ఇంకో కొంతమంది కూడా వహ్వా, శభాష్, బ్యూటిఫుల్, అని ఆనంద పడిపోయారు. నేను కూడా కొంచెం ఆలోచించి లేచి నుంచుని వహ్వా అనబోతుండగా సేన్ గారు నా చేయిపట్టి లాగి కూర్చోపెట్టాడు.


తెరమీద సీను మారిపోయింది. ఇప్పుడు ఒకాయన ఓ పంచను రాతి కేసి కొట్టేస్తున్నాడు. ఉతుకుతున్నాడన్నమాట. మా సేను కళ్ళలో విషాద నీరు. నాకు కోపం వచ్చేసింది. ఏంజరుగుతోంది, ఆ కాకి ఎందుకు కావ్ మంది అని అడిగాను.


 కాకి కావ్ మనక భౌ భౌ అంటుందా అని కోప్పడ్డాడు సేను గారు. అపుడు నాకేమీ అర్ధం కాక, పూర్తిగా అయో మయావస్థలో, బెంగాలీ సినీమాల్లో అందులో సత్యజిత్ రే సినీమాలో, కాకులు ఎందుకు భౌ భౌ మన వని పెట్టిన కొచ్చెను మార్కు మొహం..

 

పెళ్ళికి మునుపటికి తరువాయి కి వ్యత్యాసం ?

 

అప్పటి కింకా పెళ్ళి కాలేదు. ’అయినా’ నాకు ముగ్గురు బాసులుండే వారు." పెళ్ళైతే ఒకే ఒక్క బాసు అని పెళ్ళైతే కానీ తెలియలేదు.

 

మీరు యోగా నేర్చుకున్నారటగా ?

 

ఆత్మ ప్రభోధానుసారం, యోగా నేర్చుకుందామని అనుకున్నవాడనై, మా కాలనీలో యోగా నేర్పువారి కోసమై గాలించితిని. మా కాలనీలో ముగ్గురు యోగా గురువులు ఉన్నారని తెలిసింది.


ఇద్దరు మగ గురువులు, ఒక ఆడ గురువు. సహజ ప్రకృతి దోష ప్రభావమున, పరస్పర అయస్కాంతాధారిత విజ్ఞాన సూత్రాదేశముల వలనను, మొదటగా రెండవ వారి దగ్గర నేర్చుకొనవలనను ఉత్సుకత కలిగినది.


ఓ శుభ సాయం సమయమున, పిల్లలు ట్యూషనుకు వెళ్ళు వేళ, ఆటో వాళ్ళు మీటరు మీద పది రూపాయలు అడుగు వేళ, గృహంబునకు అరుగు దెంచు శ్రీపతులకు, శ్రీమతులు ఆలూబొండాలు, బజ్జీలు వేయు వేళ, సువాసనలను ఆఘ్రాణించుచూ ఆడగురువు గారి గృహాంగణమున అడుగు పెట్టినవాడనైతిని.


నా రాకను మాగురువుగారి పుత్రశ్రీ ఇంటిలో సమాచారము ఇచ్చినవాడయ్యెను. ఒక పది నిముషములు అతి భారముగా గడిచిన పిమ్మట, ఓ మధ్య వయస్కుడు, సుమారుగా నలభై ఏళ్ళ వయసు గలవాడు నా ఎదుట ప్రత్యక్షమైనాడు. "I am Sailajaa naath, What can I do for you ?"అన్నాడు.!




నా కాలి క్రింద భూమి కంపించెను. ఆకాశమున ఫెళ ఫెళా రావము లతో ఉరుములు, మెరుపులు గర్జించెను, మెరిసెను. సముద్రమున అలలు ఆకాశమున కెగసెను. పర్వతములు బద్దలయ్యెను.

 

మా ఏడుకొండలవాడి గురించి మీ అభిప్రాయం ?
 

శ్రీవెంకటేశ్వర స్వామి ఒక విధమైన నిద్ర మత్తు లో ఉంటున్నారు రాత్రి 12.30 గం నిద్రపుచ్చి నట్లే పుచ్చి, 1.30 గం లకు సుప్రభాతం పాడుతున్నారు. వారికి విశ్రాంతి, నిద్ర రెండు నూ లేవు. వారి వంటిమీద, వారి ఖజానాలోనూ యున్న ఆభరణములు మాయమైననూ వారికి తెలియ లేదు. బ్రహ్మ, శివ, దేవేంద్రాది దేవతలు పెద్ద పెద్ద గొంతుకలతో స్తోత్రము చేసిననూ వారికి వినిపించుట లేదు. నేనెంత, నాగొంతు కెంత, నా అభిప్రాయాలకి విలువెంతంటారు జేకే గారూ ?





మీ 'నేను ఎందుకు రాస్తున్నాను " టపా మీద చెలరేగిన దుమారం, విమర్శకి లోనయ్యిందని వినికడి ?






ఈనాటె బ్లాగు పోకడల గురించి సరదాగా, నవ్వుకోవడం కోసం వ్యంగంగా రాసిన వ్యాఖ్యానం “నే నెందుకు వ్రాస్తున్నాను” అన్న నా రచన. ఇందు కోసం అలనాటి పురాణ రచయితలని, కధలు చెప్పిన వారిని , గురించి కొంచెం సరదాగా, హాస్యం కోసం రాయడం జరిగింది. అంతే తప్ప వారిని, తద్వారా పురాణాలని కించపరచడం నాఉద్దేశ్యం కాదు. ఒక వేళ ఎవరైనా అల్లా అభిప్రాయపడితే వారికి నా క్షమార్పణలు చెప్పుతున్నాను.
పురాణాల గురించి, మతం గురించి కాని చర్చించే టంతటి జ్ఞానం నాకు లేదు. అది ఈ బ్లాగులో నా ఉద్దేశ్యం కాదు. సహృదయంతో అర్ధం చేసుకుంటారని ఆశిస్తున్నాను.


నేను పురాణాలు ఆట్టే చదవలేదు. కాబట్టి వాటి గురించి చెప్పే అర్హత నాకు లేదు. ఏపురాణమైనా, మతమైనా మనిషి ని సన్మార్గంలో నడిపించడానికి, సత్ప్రవర్తన అలవర్చుకోవాలని బోధిస్తాయి. అది అందరూ చెపుతున్నారు. మళ్ళీ ఈ విషయం మీద నాబ్లాగులో చెప్పాల్సిన అవసరమూ లేదు.

 

ఉజ్వల భట్టాచార్య తో మీ  అఫైర్ ?




నావలో కూర్చుని “లాహిడ్ లాహిడ్ లాహిడ్ లూల్ జంగమే హుయాళా హుయలా” అని పాడేస్తోంది అనుకున్న నాకు షాక్- ఉ.కృ.నా.మీ అయితే రెండు రోజులు తేరుకోలేదు.


మరి ఇలియానా మాటో ?

  
ఎవరూ, రంగమ్మ గారా?  లిఫ్ట్ లోకి అడ్డంగా కానీ వెళ్లలేని ఆవిడా ? చాలా కాస్ట్లీ అఫైర్ అది. జేబు చిల్లు పడింది ఎక్కువ. చమురు వదిలిందీ ఎక్కువే ! చమురు ఎంత వదిలినా ఆరోగ్యమే మహా భాగ్యము కదా.
ఎప్పుడు అవకాశం వస్తుందా అపార్ధం చేసుకోవటానికి అని ఎదురు చూస్తున్నారా మీరు. దొరికి పోయానా ? 


ఈ విషయం అమ్మగారికి చెప్పమంటారా ? 




ప్రతిదీ అమ్మగారి దగ్గరికి తీసుకెళ్లతానంటారు. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారా ఏమిటీ?

మీరు కొత్త ఫిట్టింగ్ లు ఏమి పెట్టకండి. ప్రభావతి గారు ఎప్పుడూ దుర్గాదేవి లాగా కళకళ లాడుతూ కనిపిస్తుంది ప్రద్యుమ్నుడికి.  


మీకు  బ్లాగ్ లోకం లో  జంధ్యాలగా,  ముళ్ళపూడి గా  గుర్తింపు ?

 

ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి. ఏమిటోనండి సీరియస్ గా గంభీరంగా రాద్దామనే ప్రయత్నిస్తాను. మరి అందులో కూడా హాస్యం చూసే సహృదయులు మీరు.


ఒక బ్లాగరి  జంధ్యాలగారి లా అన్నారు. కొందరి కి పానుగంటి వారిలా రాసాని అనిపించింది. మరి కొందరికి చిలకమర్తి జ్ఞాపకాని కొచ్చారు . (ఎవరూ బులుసు లా రాసేరాని మేచ్చుకోరేమిటి చెప్మా? )


వారి స్థాయిలో కనీసం ఓ 10-15% అందుకున్నా ధన్యుడిని అయినట్టే అనుకుంటాను. దానికే నా జీవిత కాలం సరిపోతుందా అని అనుమానం. కానీ వీరిద్దరి కన్నా నేను ముళ్ళపూడి గారిని అబిమానిస్తాను. వారు చేసే మాటల గారడీ మరెవరు చేయలేరనిపిస్తుంది నాకు. థాంక్యూ.

 

మీ బ్లాగుకి వచ్చిన వందలాది కామెంట్లు చదివి మీరెలా ఫీల్ అయ్యారు ?

 

కామెంట్లు రాసిన వారందరికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు, థాంక్యూ.
మావుల గుంపులందు మధుమాసములన్
వికసించు కోకిలారావము వోలె (వేదుల)
వినిపించాయి మీ సుమధుర వ్యాఖ్యలు!


మీ బ్లాగు దర్శకులకి మీ ఆహ్వానం ?




స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాను
ఆ పరిచిన పూల మీదుగా ఇలా నడిచి రండి
ఆ సింహాసనం అధిష్టించండి
ఈ పూలగుచ్చం స్వీకరించండి
ఈ గజమాల వేయనీయండి
ఈ పట్టుశాలువా స్వీకరించండి
ఈ కానుకలు స్వీకరించండి
నేను విసురుతున్న వింజామరనుంచి
వీచే మలయమారుతాన్ని ఆస్వాదించండి
పళ్ళు ఫలహారాలు భోంచెయ్యండి
మీకోసం ప్రత్యేకం గా తయారుచేయించిన
జున్నుపాల పరమాన్నం ఆరగించండి



మీ ఇంటి లాండ్ లేన్ నెంబర్ ఇస్తారా ?




నా జీవితం తెరిచిన BSNL వారి హైదరాబాదు టెలీఫోను డైరక్టరీ. అనవసర విషయాలు ఎక్కువ, అవసర విషయాలు నిల్. చిన్న చిన్న అక్షరాలలో Dr. B. Subrahmanyam, South End Park అన్న చోట ఉండే నంబరు నాదే నాదే. మీకు లావుపాటి కళ్ళద్దాలు ఉంటే అందులోంచి చిన్న అక్షరాలు కనిపించవు ఆనుకుంటే బెటర్ లక్ నెక్స్ట్ టైం !

 
Concept by  Zilebi
జేకే - JUST KIDDING !
ABN - Active Bloggers Network 
- ఆంద్ర జిలేబి - ఇంకెవరు నేనే !

చీర్స్
జిలేబి.