Thursday, May 16, 2013

బుజ్జి పండు తెలుగు చదువు - శ్రీ భాస్కర విజయం

यहाँ हाट हाट जिलेबी मिलेगी


ఆల్ఫ్ పర్వత శ్రేణులలో హిమవత్పర్వతం లా ధవళ కాంతులతో విరజిల్లుతోన్న యంగ్ ఫ్రౌ పర్వత పరిసర ప్రాంతలో
ఒక ఇండియన్ హోటలు బయట పెద్ద బోర్డు పెట్ట బడి ఉంది.

డిసెంబరు నెల చలి వణికిస్తోంది. చలికాలం కావడం తో ఇండియా నించి ఊడి పడే స్విస్సు యాత్రికులు అస్సలు ఎవ్వరూ లేరు.

కౌంటరు ముందు కూర్చుని చలికి వణుకుతూ శివ శివా అని స్మరణ చేస్తున్న జమ్బూనాధాన్ కృష్ణ స్వామీ అయ్యరు ట్రింగ్ ట్రింగ్ అంటూ పాత కాలపు ఫోను రింగు అవటం తో ఫోను రిసీవరు తీసి 'హలో' అన్నారు.

ఆ వైపు వున్న ఆసామి 'నేను హంగేరీ నించి మాట్లాడుతున్నా. జిలేబీ గారున్నారండీ ' అన్నాడు వచ్చీ రాని హిందీ అక్సెంటు లో.


"జిలేబీ నీ కోసం ఎవరో ఫోన్ హంగేరి నించి " అని జంబూ వారూ లోపలి కేక పెట్టి మళ్ళీ శివ శివా అంటూ నామ జపం లో పడ్డారు.

అప్పటి దాకా ఆ రోజు వెయ్యాల్సిన జిలేబీలకి పిండి కార్య క్రమం లో వున్న , కస్సు బస్సు మంటున్న జిలేబీ , హమ్మయ్య ఈ పిండి రుబ్బే కార్యక్రమం కట్ట బెట్టి ఫోన్ లో టైం పాస్స్ చెయ్యొచ్చు అని సంతోష పడి పోయి, "ఇదిగో అయ్యరు వాళ్ - ఈ పిండి కార్యక్రమం చూడండీ " అని వారికి పని పురమాయించి ఫోన్ దగ్గరికి వెళ్ళింది జిలేబీ.

అయ్యరు గారు, శివ శివ అంటూ "ఈ జిలేబీ తో వచ్చిన చిక్కే ఇది, ఫోన్ వచ్చిమ్దనో, అదనో ఇదనో ఏదో ఒక నెపం తో మనకి పని పెట్ట కుండా వుండదు సుమా " అని గొణుక్కుంటూ సణుక్కుంటూ పిండి కార్యక్రమాన్ని చూడడానికి లోనికి వెళ్ళారు.

జిలేబీ ఫోన్ దగ్గరికి వచ్చి తీరిగ్గా ఓ గంట సేపు మాట్లాడింది. ఆవిడ గంట సేపు మాట్లాడిన సమాచారం ఏమిటంటే -

ఈ హంగేరీ ఆసామీ ఆయుర్వేద ఇన్స్టిట్యుట్ నడుపుతున్న హంగేరీ ఆసామి. ఈతను అప్పుడెప్పుడో యంగ్ ఫ్రౌ మౌంటైన్ కి వచ్చిన సమయం లో ఈ ఇండియన్ హోటలు కి వచ్చినాడు. జిలేబీ తో పరిచయం అప్పుడే. ఈ మధ్య ఆ హంగేరీ ఆసామీ ఆయుర్వేదా రిసెర్చ్ చేస్తూ 'పరహిత వైద్యం ' గురించి చదివాడట చూచాయిగా. అందుకని తన కేమైనా దీని గురించి తెలుసా , ఆ విషయమై ఎవరైనా హంగేరీ వచ్చి లెక్చర్ ఇవ్వగలరా అని కనుక్కోవడానికి ఫోను చేసాడు.

జిలేబీ మరీ ఖుషీ అయి పోయింది. తనకు తెలియని విషయం అని ఏదైనా ఈ లోకం లో ఉందా ? ఆయ్ అని 'ఓ బ్రహ్మాండం గా తెలుసు, ఓ పెద్దాయన పరహిత వైద్యం గురించి రాసారు. శర్మ గారని. వారిని పిలుద్దాం ' అని హంగేరీ వాడికి , కష్టే ఫలే శర్మ అనబడు మాచన వఝుల వేంకట దీక్షితులు గారైన చిర్రావూరి భాస్కర శర్మ గారికి మధ్య అటు వైపు ఒక ఫోను, ఇటు వైపు ఒక ఫోను మాట్లాడి, మొత్తం మీద శర్మ గారు హంగేరీ వచ్చేటట్టు ఒప్పించి 'హుష్' ఎంత కష్ట పడి పోయాను సుమా అని నీరస పడి పోయి, హైరాన్ పడి, మళ్ళీ ఒక మారు 'అయ్యరువాళ్' ఒక మంచి కాఫీ పట్టుకు రండీ అని జంబూ అయ్యరు గారిని పనికి పురమాయించింది జిలేబీ.

'ఈ జిలేబీ కి అందరికీ పని కట్ట బెట్ట కుంటే పొద్దే గడవదు సుమా ' అని మళ్ళీ గొణుక్కుంటూ అయ్యరు గారు ఫిల్టరు కాఫీ ప్రయత్నం లో పడ్డారీ మారు.

****** భాగం 2 *****

హంగేరీ - బుదాపెస్ట్ మహానగరం.
బుదా, పెస్ట్ రెండు నదుల మధ్య ఐరోపా లో సుందరమైన నగరం గా పేరు గాంచినది.

మే నెల వచ్చేస్తోంది. చలి కాలం పోయి, వాసంతం వచ్చి, సూరీడు కిరణాలు వేడిని చలి కి వెచ్చ గా ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది.

హంగేరియన్ ఆయుర్వేద ఫౌండేషన్ ఆఫీసు సెమినార్ హాల్ ముందు ఫోక్స్ వాగన్ బీటల్ కారు ఆగింది.


సెమినార్ హాల్ ముందు వేచి ఉన్న హంగేరియన్ ఆయుర్వేదా ఫౌండేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ గేబై కారు నించి దిగుతున్న శ్రీ భాస్కర శర్మ గారి కి స్వాగతం పలుకుతూ నమస్తే శర్మాజీ అన్నాడు రెండు చేతులూ జోడించి, "మంచి వేళ ఇవ్వాళ ! ఎప్పుడూ మా దేశం లో కరెంటు పోదు. అయితే ఇవ్వాళ కరంటు పోయింది ఇక్కడ ! ఇవ్వాల్టి కార్యక్రమం ఎలాగబ్బా అని ఆలోచిస్తూంటే, మీ రలా రావడం, కరెంటూ ఒక్క రెండు నిమిషాల ముందే రావడం అంతా సవ్యం గా కానవస్తోంది నాకు " అన్నాడు.


పంతొమ్మిదివందల ముప్పై ప్రాంతాలలో ప్రారంభించ బడ్డ ఫౌండేషన్ హంగేరీ లో చాలా మంచి పేరుని గాంచింది. ధీటైన రిసెర్చ్ సెంటర్ గా మారిన ఫౌండేషన్ ఆయుర్వేద రిసెర్చ్ లో ప్రముఖ స్థానాన్ని వహించడం ఆ దేశం వారి కృషికి నిదర్శనం.


ఆయుర్వేద ఏ ఒక్క జాతి కో మతానికో చెందినది కాదు. ఐదు వేల సంవత్సరాల పై బడ్డ మానవ మేధో సంపత్తి అది. అట్లాంటి ఆయుర్వేద తా పుట్టిన దేశం లో అల్లోపతీ సుడిగుండం లో కొట్టుకు పోతూంటే , ఐరోపా లో పునరుద్ధరణ కి సంసద్ధ మవు తోంది.


సెమినారు హాలు లో చిర్రావూరి దీక్షితులు గారిని పరిచయం చేస్తూ , గాబై మాట్లాడాడు. శ్రీ శర్మ గారిని ప్రస్తుతిస్తూ వారు రాసిన 'పరహిత వైద్యం' గురించిన విషయాలను ఉటంకించాడు.


ఆ పై శర్మ గారు గాబై ఆహ్వానంతో ఆ నాటి అతిధి ఉపన్యాసాన్ని మొదలెట్టేరు.


"సభకు నమస్సులు. మీ ఫౌండేషన్ పంతొమ్మిది వందల ముప్పై ప్రాంతం లో ప్రారంభింప బడ్డది. మా నాన్న గారు పంతొమ్మిది వందల ముప్పై ప్రాంతాలలో ఈ పరహిత వైద్యం చేసేవారు " చెప్పారాయన .


ఫౌండేషన్ చప్పట్లు చరిచింది. హంగేరీ వాసులకు సారూప్యతలు నచ్చుతాయి. అంతే గాక ఈ సారూప్యతలకి ఖచ్చితం గా
ఒక లింకు ఎక్కడో అక్కడ ఉండే ఉంటుందని వారి నమ్మకం.


పరహిత వైద్య విధానం దక్షిణ భారత ఆయుర్వేద వైద్య విధానం. ఈ విధానం పేరుకు తగ్గట్టు పరుల హితం కోరి చేసేది. ఇందులో స్వలాభోపేక్ష కి తావు లేదు. ఈ వైద్య విధానాన్ని స్వీకరించేవారు నియమ నిబద్ధతలకి కట్టు బడి ఉండే వారు. లోకాః సమస్తాః సుఖినో భవంతు అన్నది వేద వాక్కు. శన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే అంటుంది వేదం. అంటే సర్వ జంతు జాలాలు శాంతి గా ఉండాలి. ఒక్క మానవ మాత్రుడు మాత్రం ఆరోగ్యం గా సంతుష్టుడై ఉంటే చాలదు. సర్వ జంతు జాలాలు కూడాను.
ఆయుర్వేద మానవులకూ, సర్వ జంతు జాలాలకు సంబంధించింది. నా వర కైతే నేను గమనించింది మా తండ్రి వారి గురించి విని ఉన్న పరహిత వైద్యం. " శర్మ గారు తేట తెల్లమయ్యే లా సవివరం గా చెప్పు కొచ్చేరు పరహిత వైద్యం గురించి.
వారి ఒక గంట పాటి ప్రసంగం అలా అలవోకగా గోదావరీ పరవళ్ళు లా బుడా నదీ ప్రాంతం లో సాగి పోయింది. ఫౌండేషన్ అతిధులు శర్మ గారి వాక్ ప్రవాహానికి మంత్ర ముగ్దులై అలా వింటూ ఉండి పోయారు.
ఆ పై ప్రశ్నల పర్వం మొదలయ్యింది
"శర్మ గారు, ఇంత మంచి వైద్య విధానం అలా ఒక తరం తో ఆగి పోవటం పాశ్చ్యాత వైద్య విధానం మీ దేశం లో త్వరిత గతిన పెంపొందడ మే నంటారా ?"
అది ఒక కారణం. ఆ పై ఈ వైద్య విధానం కాలగతిన తరువాయి తరానికి పట్టక పోవడం కూడా మరో కారణం. ఉదాహరణ కి మా తండ్రి తరువాయి నాకు ఆ భాగ్యం దక్క లేదు "
"భారద్దేశానికి ఈ కర్మ సిద్ధాంతమే, భాగ్యం , అభాగ్యం మీద నమ్మకాలే ఒక నెగటివ్ పాయింట్ అనిపిస్తుంది మాకు " మరో మెంబర్ చెప్పాడు.
"కావచ్చు. ప్రయత్నే ఫలే . కష్టే ఫలే. కాని మరో కోణం నించి ఆలోచిస్తే జన సాంద్రత కి ఈ కర్మ సిద్ధాంతమే ఓ పాటి మనః శాంతి ని కలిగిస్తూ, దేశం నానా విధాలా అసంతృప్తి కి లోను కాకుండా కాపాడుతోందని అనిపిస్తుంది కూడాను. ధర్మ మైన సంకల్పం, ధృడంగా అమ్మమీద భారం వేసి, కార్యక్రమం నడిపిస్తే అంతా సవ్యమే, అప సవ్యం సమస్య లేదు. అదే నా అనుభవం" చెప్పారు శర్మ గారు.
"ఈ దైవ నమ్మకం ఐరోపా లో తిరోగమన వాదం గా పరిగణింప బడుతోంది " మరో మెంబెర్ చెప్పాడు.
"కావచ్చు. మన కన్నా పై నొక శక్తి లేక డిఫరెంట్ డైమెన్షన్ అన్నది ఉన్నది అన్నది వాస్తవం. ఆ మరో కోణాన్ని తమ 'దృష్టి ' తో చూసిన వారు ఋషులు. అందుకే వారు 'దీర్ఘ దర్శులు'. ఆ దీర్ఘ దర్శులు గాంచినదే , తమ మేధో సంపత్తి తో గాంచినదే ఆయుర్వేదం. అంటే వారు వేరే డైమెన్షన్ లో దృష్టి ని సారించి, ఈ వైద్య విధానాన్ని కనుక్కోవడం అంటూ జరుగుతూంది. ఇది ఈ ఒక్క శాస్త్రానికి మాత్రమె సంబంధించినది కాదు. మీరు ఇప్పుడు వస్తున్న ప్రతి 'ఇన్నోవేషన్' వెనుకా దీని మూల భూతులైన వారు తమ పరిధి ని దాటి మేధస్సును ఉపయోగించడం తో టే గదా ఈ సరికొత్త సాధనాలు పరికరాలు మనకు లభిస్తున్నాయి "
ఆ నాటి సభా కార్యక్రమం ముగింపు కొచ్చింది. మెంబెర్స్ జోహారు లందించారు శర్మ గారి సంభాషణ కి.
గాబై సంతృప్తి గా చూసాడు శర్మ గారి వైపు "మీరు అప్పుడప్పడు మా మెంబెర్స్ ని అడ్రస్ చేస్తూ ఉండాలి' చెప్పాడాయన.
"అమ్మ దయ ఉంటే నిరభ్యంతరం గా అలాగే " చెప్పారు శర్మ గారు.
గాబై విచిత్రం గా చూసాడు శర్మ గారి వైపు. ఇన్ని సంవత్సరాలు గా భారద్దేశ వైద్య విధానాన్ని గమనిస్తూన్నా కూడా, ఈ దైవ చింతన ఈ దేశ ప్రజలలో ప్రతి విషయం లో అంతర్లీన మై వుండడం వారికి ఎప్పటికి అర్థం కాని విషయం !

Thursday, February 28, 2013

జిలేబీ శతకం

జిలేబీ శతకం

శతక కర్త - శ్రీ తాడిగడప శ్యామల రావు గారు

బ్లాగ్ లోకం లో వీరు 'శ్యామలీయ' మై
బుజ్జి పండు తెలుగు చదువు లో దర్శన మిచ్చి న వారు


గమనిక: ఈ రచన సర్వ హక్కులు శ్రీ తాడిగడప శ్యామల రావు గారివి.
జిలేబీ టపా , కామెంటు చెండులు వీటికి ఉత్ప్రేరకాలు మాత్రమే!


***

ఆనీదవాతగ్ స్వదయా తదేకం
అన్నన్నా నువు మాయలు
పన్నే మొనగాణ్ణి పట్టి బంధిస్తావా
నిన్నే బంధించాడా
నన్నూ అట్లాగె పట్టినాడు జిలేబీ



పోనీలే అది బంధం
ఐనా బాగుంది నాకు అది అట్లాగే
కానీ కబుర్లు చెబుతూ
పోనీ మన చేత బడక పోడు జిలేబీ


బంధాలెరుగని వాడిని
బంధించాలని దురాశ పడితే చాలా
బంధించ భక్తి పాశం
సంధించే యొడుపు ఉన్న చాలు జిలేబీ



అది సాధించే విద్యను
పది జన్మలనుండి యెంత బాగా రోజూ
వదలక నే అభ్యాసం
కుదురుగ చేస్తుంటి నమ్మ కూర్మి జిలేబీ


నేనెరిగనంతవరకును
మానక సద్భక్తి గొలుచు మనుజుల వద్దన్
తానే తప్పక బందీ
గానుండును ప్రభువు నిజము గాను జిలేబీ


స్నేహమేరా జీవితం


చక్కని స్నేహం బొక్కటి
దక్కినచో జీవితంబు ధన్యము గాదా
పెక్కురు సామాన్యులతో
చిక్కిన అది బ్రతుకు తీపి చెరచు జిలేబీ



కొంచెము గానైనను తగు
మంచి తనము గతము నందు మన కగుపించెన్
మంచికి రోజులు కావివి
ముంచే స్నేహాలు పెద్ద ముప్పు జిలేబీ


గొబ్బిళ్ళ ఉగాది

కం. ఏడాది పొడవు నావులు
దూడలునుం గడ్డి తినవె దుందుడు కొప్పన్
పేడను వేయవె గొబ్బి
ళ్ళాడుట కేమొచ్చె దోష మనగ జిలేబీ


కామెంటు చెండులు

కం. విపరీతంగా చదవా
లపుడప్పుడు తోచినట్లు వ్యాఖ్యానించా
లపుడప్పుడు మౌనాన్నీ
ఉపయోగించాలి తెలివి యొప్ప జిలేబీ.

పద్మ అవార్డులు


కం. అరవై మూడేళ్ళాయెను
దొరలిచ్చే గౌరవాలు దూరందూరం
జరుగుతు ఆంధ్రావని అం
దరనీ కడు చిన్నబుచ్చుతాయి జిలేబీ

కం. ఏటేటా పందేరం
కోటాపద్మాలు మనకు కుదరని బేరం
నూటికి కోటికి ఒకటి గి
రాటెస్తే సంబరాలు రావు జిలేబీ

కం. దొంగలు పంచేసుకునే
రంగుల పద్మాలు మనకు రాకుంటేనేం
నింగిని ముట్టే వెలుగు త
రంగాలకు చిన్నతనము రాదు జిలేబీ



అపుత్రస్య .....

కం. పొరబా టిరు వైపులనుం
తరచుగ గలుగుటను జేసి తలిదండ్రులు దు
ర్భరమగు సంకటములకుం
గురియగు దృశ్యములు గుండె కోయు జిలేబీ


సిరి సిరి


కం. సిరి నెన్నెడు మానవులను
కరుణించడు విష్ణుమూర్తి కమలాలయయున్
హరిభక్తు లైన వారల
పరికింప దటండ్రు విబుధవరులు జిలేబీ


కం. హరి బాయదు సిరియందురు
హరియును సిరి నురము మీద నాభరణముగా
ధరియించు నందు రిలపై
నిరువురు నొకచోట నుండ రేల జిలేబీ!


కం. సిరి తనవశమై యుండగ
నరుడడుగుట తప్పుగాదె నారాయణునిన్
మరచునదియు చెడునదియును
ధరాజనులె హరిది లేదు తప్పు జిలేబీ


కం. హరిభక్తుడైనవానికి
హరిభక్తియె సిరియు గాన నతని కితరముల్
సిరులేల గాన లోకము
పరమదరిద్రునిగజూడ వచ్చు జిలేబీ
కం. హరిసిరులిర్వురునొకచో
ధరనుండమి వెఱ్ఱమాట తగ మోక్ష శ్రీ
కరుణించదె హరిభక్తుని
నరునకు నింకేమి వలయు నమ్మ జిలేబీ


గీత మీద పేరడీ


కం. గీతల మీదే పేరడి
రాతలు మెరిపించు నేర్పు రాదు సులువుగా
ఐతే రసవద్గీతల
చేతులు కల మంచి రామ చిలక జిలేబీ!

చీనా బంగారం
కం. బంగారమందు చైనా
బంగారం వేరు జాతి బంగార మసల్
బంగారం కన్నా యీ
బంగారం కారుచవక బాంగుందమ్మా
 
చరాచరములు

కం. చరమచరంబుల బేధము
చరమచరంబులకు మధ్య సామ్యంబును ఆ
చరమున కచరంబునకును
నెరవగు తత్వమును గూర్చి నేర్పు జిలేబీ

కం. వినుడని ఘన తత్వంబును
కనుడని సూక్ష్మంబు తెలిసి గాంధీ రీతిన్
మనుడని కర్మిష్ఠులరై
జనులకు నెలుగెత్తి చాట జాలు జిలేబీ

కం. నరులార చరాచరముల
చరాచరేతరపరమవిషయతత్వములన్
పరుగాపి పట్టుకొమ్మని
మరిమరి బోధించు చుండె మనకు జిలేబీ

హిందీ

కం. హిందీలో రాస్తారా
ఎందుకునూ పనికిరాని హిందీ నాదే
అందం చందం తెలియక
కందానికి పెద్ద శిక్ష కలిగె జిలేబీ


చీనా బంగారం

కం. బంగారం ఓ చైనా
బంగారం యెప్పు డూడి పడతా వంటూ
బెంగపడి వేడు తున్నా
చెంగున రాదాయె పసిడి చెలువ జిలేబీ



చిలకలపూడి బంగారం

కం. వెల తక్కువ బంగారం
చిలకలపూ డనెడి యూర చిక్కేనటగా
వలసినచో ఆత్రేయను
పిలచిన ధగధగలు వెల్లి విరియు జిలేబీ


స్వర్ణ వైరాగ్యం


కం. ఔరా బంగారంపై
వైరాగ్యం తెచ్చుకున్న వచ్చేసేనా
భారత నారికి పసిడికి
తీరని యనుబంధమెంత తీపి జిలేబీ

కం. కొనగలిగి నపుడు పసిడిని
కొనవచ్చును కోర్కె తీర కొనలేకున్నన్
తన కంత మోజు లేదని
యనుటే సరియైన మాట యగును జిలేబీ


అందం ఆనందమయా

కం. తానెవ్వరు తనకెవ్వరు
మానిత స్నేహములు బంధుమరియాదల తో
ఆనందమేల తనకగు
ధ్యానంబున వీని తెలియ దగును జిలేబీ

కం. తాను వినిశ్చయముగ పూ
ర్ణానందమయుండు తనకు నందరు నట్లే
కాని యవిద్య కొడంబడి
జ్ఞానవిహీనుడుగ నుండు జనుడు జిలేబీ



పరిచయ బాంధవ్యం


కం. నరులకు సంసర్గముచే
పరమ సుఖ బ్రాంతి కలిగి బంధములందే
నిరయంబగు సామాన్యపు
పరిచయబాంధవ్యసమితి వలన జిలేబీ

కం. గాలిని యూరక తిరిగెడు
ధూళికణంబులను బోలు దోషాస్పదముల్
నేలను పెక్కురి బ్రతుకులు
కాలంబున వారి జాడ కరగు జిలేబీ

కం. ఉత్తములగు కొందరు తమ
చిత్తంబుల నధిగమించి స్థిరులై సత్తున్
చిత్తునెరుంగుచు పొందెద
రిత్తనువుల గడచు జ్ఞానమెల్ల జిలేబీ

కం. అతికొద్ది సంఖ్య నుండెద
రతులిత కరుణాప్రపూర్ణులగువారలు స
మ్మతి నితరులకును తగు స
ద్గతిమార్గము జూపునట్టి ఘనులు జిలేబీ

కం. తగువారు గురువులనగా
జగమున తఛ్ఛిష్య గణము సత్పురుషులుగా
నగుటేమి వింత విషయము
భగవంతుడు వారి నిష్ట పడును జిలేబీ

విన్నపాలు వినవలె

కం. అందుకు అభ్యంతరమా
అందుకొనుడి శర్మగారు హాయిని గొలిపే
కందాల విందు రోజూ
అందాల టపాలు వేసి అప్పటికపుడే


లవ్ దై నైబర్ ...

కం. పక్కింటి వాళ్ళ నెరగం
ఎక్కడనో ఉన్న వాళ్ళు నెట్-ప్రియ మిత్రుల్
పక్కదిగిన యిల్లు మరల
పక్కెక్కేవేళ కంట బడును జిలేబీ


జలపుష్పం

కం.నీ వలెనే జలపుష్పపు
ఠీవిని దర్శించి నట్టి డెందం బరుదే
పూవులలో నది మేలన
కావలసిన యెరుక నీకు కలిగె జిలేబీ

కామెంటు ఉత్ప్రేరకం

కం. రమ్మా చక్కని కామెం
ట్లిమ్మా నీ రాక లేక లేఖిని ఆగే
నమ్మా జిలిబిలి పలికుల
కొమ్మా కందాలనందు కొనుమ జిలేబీ

ఉపకారం

కం. ఉపకారవ్యసనులతో
నెపమిడి పదిపనులు కొనగ నేర్చెడు వారే
ఉపకారమడుగ బోయిన
నపవాదులు వేయు వార లవని జిలేబీ

కం. అపకారుల కుపకారము
విపరీతఫలంబునిచ్చు విమతుల నటులే
యుపకార బుధ్ధి విడచుట
నెపమై దాస్యమున కూలె నేల జిలేబీ

కం. మొగమోటమి గలవారిని
పొగడిన పని జరుగు ననుచు పోగగు వారల్
మొగ మైన జూప రావల
తగు జాగ్రత వలన చిక్కు తప్పు జిలేబీ

ఊరికి బాసట

కం. ఊరికి బాసట యగుచో
నూరక నోరార పొగడు నోళ్ళకు కొదవే
వారల యందే యొక్కరు
రారుసుమా మనకు నక్కరైన జిలేబీ

కం. ఆ యింటి మామిడాకులు
వే యిండ్లకు తోరణాలు మరి యేటేటా
కాయలు పచ్చళ్ళకు దయ
చేయించు పరోపకార జీవి జిలేబీ


ఇరుకు జీవితాలు

కం. ఇళ్ళిరుకులు గుళ్ళిరుకులు
పల్లెలు పోటెత్తి రాగ పట్నా లిరుకుల్
బళ్ళిరుకు మనసులిరుకులు
కల్లలతో బ్రతుకులిరుకు కలిని జిలేబీ


'వి' గ్రహాలు

కం. పడి పోయిన పడ నుండిన
పడి లేచిన విగ్రహాల బాధలు చూస్తూ
మిడికే నేతల బొమ్మలు
పొడమును పడిపోవు నటులె పుడమి జిలేబీ

ప్రవీణు శర్మ

కం. నేరక ప్రవీణు శర్మకు
మీరు జవాబిచ్చి గాని వివరించారో
వారింక మిమ్ము వదలరు
పోరాడే యోపికుంటె పొండు జిలేబీ

ఇన్నయ్య ఎవరు ?

కం. ఇన్నయ్య హేతువాదుల
కన్నయ్యే హైందవంబు నంతంచెయ్యా

లన్నదె ఆయన ధ్యేయం
బెన్నటికిని మారజాల డితడు జిలేబీ

కం. పళ్ళున్న చెట్లమీదే
రాళ్ళుగదా హేతువాద రాకాసి జనం
నోళ్ళన్నీ వేదనిందకు
పళ్లికిలిస్తాయి బాధ పడకు జిలేబీ

మ్యాచు ఫిక్సింగు !

కం. ఓడుతు పోతున్నారని
వాడల వాడలను తిట్ల వర్షాలాయే
నేడొకటి గెలవగానే
తేడానూ ఒప్పుకోరు తిరిగి జిలేబీ

కాపీ 'రైటు' జన్మ హక్కు

కం. కాపీ కొట్టే రైటుకె
కాపీరై టనెడి పేరు ఖాయం ఐతే
కాపీ పిల్లుల తప్పా
పాపం మన పాలు వారి పాలు జిలేబీ

సిగ్గే సింగారం

కం. సిగ్గేమిటి బేహారికి
సిగ్గేమిటి హంతకునకు సినిమా నటికిన్
సిగ్గేమిటి మరి నేతకు
సిగ్గేమిటి సిగ్గు పడును సిగ్గు జిలేబీ

నడక-నడత

కం. నడకలు కుదురుగ నుండిన
పడకుండగ నరుడు బ్రతుకుబాటను నడచున్
గడబిడ పడి వడిపెంచిన
పడుటయు చెడుటయును గల్గు వసుధ జిలేబీ

కం. నడకలు నేర్పెడు పెద్దలు
నడతలు నేర్పించ నెదురు నడచును మరియున్
కొడుకులు కూతుండ్రకు తా
నడతలు నేర్పించ గోరు నరుడు జిలేబీ

గారెల పాకం

కం. పాకం గారెలు చేస్తే
నాకం కనిపించవచ్చు నాకూ మీకూ
పాకం చేస్తే గారెలు
ఆకలి చచ్చేది ఖాయమగును జిలేబీ

పంచ దశ లోకం

కం. పదునైదవ లోకం బె
య్యది మరి యటనుండు వారి యాకృతి గుణసం
పద లెట్టులుండు నోహో
అది అంతర్జాలలోక మగున జిలేబీ

'గ' మకం !

కం. నిందార్ధంబున నాంధ్రము
నందున నామ్రేడితమును నాపైన గిగీల్
చిందులు వేయును మరి యా
నందార్ధము సూత్ర మేది నడచు జిలేబీ

పాత పచ్చడి

శొ, పాతది యగుచో నేమగు
పాతది యగు చింత కాయ పథ్యం బనగా
తాతలనుండి ప్రసిధ్ధం
బీతరమున మెచ్చకున్న నేమి జిలేబీ
 
పరహిత వైద్యం
కం. తరచుగ బహుదేహంబుల
తిరుగెడునది తానె యనుచు తెలిసి తగుగతిన్
పరిచర్య చేయునదియే
పరహితమన నెగడు చుండు వసుధ జిలేబీ
కం. కాలగతి చెందువిద్యల
కాలము పునరుధ్ధరించగల తరుణములున్
కాలస్వరూపుడగు హరి
లీలలచే నిలను పొటమరించు జిలేబీ
రాబోవు కాలం

కం. మునువచ్చు చెవుల కన్నను
వెనుకనె పొడచుకొని వచ్చి పెరిగెడు కొమ్ముల్
మొనదేరి ధృడత నుండవె
మనుమలకే తెలివి హెచ్చు మహిని జిలేబీ
చేతులు కాలాక
కం. చేతికి సెగ సోకినచో
మూతికి మహబాగ గోరు ముద్దలు దొరకెన్
తాతకు నాతికి నిద్దరి
కీ తీరున సంబరములు హెచ్చె జిలేబీ

కం. జరిగిన జ్వరమంతటి సుఖ
మరుదని చెప్పుదురు గాదె అటులే ముద్దల్
సరదాగ నోటికందుట
మరి యెందరి భాగ్య మన్న మాట జిలేబీ

కం. ఇది చాలా బాగున్నది
బ్రదుకున నిటుంవంటి తీపి ప్రతివారికి నం
దదు నిక్కంబుగ భళిరే
ముదిమికి ముచ్చట్లు లావు పుడమి జిలేబీ
కం. తప్పులు సైరించెడు సతు
లెప్పుడు పడుచుందు రిడుము లీ విధముగనే
తప్పున్న దిద్దకుండిన
తిప్పలు పెట్టుటయె మగల తీరు జిలేబీ
ప్రేమిస్తున్నా

కం. ప్రేముడి యెంతయు గొప్పది
కామంబును ప్రేమయొకటి గావను నెరుకన్
సేమంబుగాంచు టొప్పును
ధీమంతుండుండు దీని తెలిసి జిలేబీ

కం. అన్నన్నా దిన మొక్కటి
యున్నదనన్ ప్రేమికులకు యుర్విని ఘనమై
మున్నూరరువది నాలుగు
చిన్నదనము బొందు నేమి చేతు జిలేబీ

కం. ఆదిన మీదన మని యే
డాదిని గల దినములన్ని యటునిటు పంచన్
మీదెరుగు తలపు జేయగ
నే దినమును మిగుల లేదు నిజము జిలేబీ

సన్యాసి బుట్టలో పడ్డాడు
నచ్చిన సుందరి యెందుకు
వచ్చెడు నొక బుట్టలోన వయ్యారముగా
తెచ్చిన యా బుట్టనె విభు
ముచ్చట చెఱ గొనగ గాక పోదు జిలేబీ
అందాల బుట్ట లోపలి
సుందరవదనారవింద సుదతీమణి చే
యందుకొనిన సన్యాసియె
వందేళ్ళకు బంది యనగ వచ్చు జిలేబీ
సన్నాసిని చేసెడునో
సన్నాసిని చూసి కన్య సరదా పడునో
సన్నాసియగుట తథ్యం
బన్నన్నా పురుషు డాలి బంటు జిలేబీ
నల్లని కురులు
వెల్లుల్లి తలకు పూసిన
నెల్లరు దూరంబు జరుగ నిక కేశములా
తెల్లనివో నల్లనివో
అల్లరి యిక లేదు గనుక హాయి జిలేబీ


మధురాధిపతే అఖిలం మధురం

కం. మధురాధిపతి స్పెషల్గా
మధురం బతివలకు నైన మాసంగతియో
మధురాధిపతి యఖిలజన
మధురాకృతి నేను వినక మాన జిలేబీ.

ఎంతెంత దూరం
కం. కామెంట్లైతే శతకం
మీ మాటల గారడీలు మెప్పించెను నే
నేమో శతకానికి ఇం
కేమాత్రందూరముంటినిపుడు జిలేబీ?


బంగరు మాటల మూట

కం. ఈ రసన యెంత చెడ్డది
నోరదుపున నున్నవాడు నూటికొకండుం
ధారుణి నుండునొ యుండడొ
తీరుగ నటులుంట యోగి తీరు జిలేబీ


కం. మాటాడుట చక్కని కళ
మాటాడక యుండు నేర్పు మరియుం ఘనమై
కోటికి నొకనికి గల్గెడు
ఓటివి తక్కొరులనోళు లుర్వి జిలేబీ



ఇల్లాలి అవధానం

కం. ఇల్లెంత పదిలమగునో
యెల్లరు నెరుగుదురుగాని యెందరి కెరుకా
యిల్లాలి చలువ చేతనె
యిల్లన గల దనుచు వారి కిలను జిలేబీ

కం. పిల్లలు పెద్దసమస్యలు
కొల్ల నిషేధాక్షరులను కూర్చెదరత్తల్
చెల్లించుచు నప్రస్తుత
మెల్లప్పుడు పలుకు భర్త ఇలను జిలేబీ

కం. అవధాని పడెడు కష్టము
లవి యణగును ఝాములోన నందరు పొగడన్
భుని నిల్లాండ్రకు నిత్యం
బవధానమె మెప్పు కాన బడదు జిలేబీ
రాబోవు కాలం

కం. మునువచ్చు చెవుల కన్నను
వెనుకనె పొడచుకొని వచ్చి పెరిగెడు కొమ్ముల్
మొనదేరి ధృడత నుండవె
మనుమలకే తెలివి హెచ్చు మహిని జిలేబీ


ఉపవాసం

కం. ఆరోగ్య మనుమతించిన
మేరకు నుపవాసదీక్ష మిగులహితంబౌ
తీరికగా నొక దినమున
శ్రీరమణుని గొలువనగును చేరి జిలేబీ.


'దండ' నాధా!

కం. దండను వేసిన చేతులు
దండంబును బెట్టినట్టి తరుణి కరంబుల్
ధండమ్మని చండికవలె
దండంబును తప్పకుండ దాల్చు జిలేబీ

దీవెనలు

కం. చాలవె యితిహాసంబులు
చాలదె మరి భాగవతము జదువగ హితమై
చాలదె పెద్దల దీవన
మేళులు చేకూర్చ మనకు వేగ జిలేబీ

జిలేబీ తెలుగు వ్యాఖ్య !

కం. నలభై పంక్తుల వ్యాసము
సులువుగ నా కర్థమాయె శోధించెడు నా
తల కెక్కక పొగరణచెను
కలనం తమ వ్యాఖ్య తెలుగు ఘనత జిలేబీ.


'టీతింగు' ట్వీటింగు !

కం. తాతకు కలిగే నకటా
టీతింగ్ ప్రోబ్లమ్స్ కొత్త త్రీజీ ఫోన్తో
యాతన పెట్టే టచ్ స్క్రీన్
చేతికి కళ్ళకును పనులు చెప్పె జిలేబీ.

కం. చిన్నప్పుడు పలకయె గద
యున్నది యని తాత మరచి యుండగ నకటా
నాన్నకు హైఫై పలకను
కొన్నాడు ప్రేమమీర కొడుకు జిలేబీ


బాపురే లవకుశ శ్రీ రామ రాజ్యం !

కం. చూడకనే పొగడుటయును
చూడకనే తెగడు టనెడు చోద్యములనగా
నేడుకదా కనిపించెను
వాడలవాడలను బాపు వలన జిలేబీ

కం. నాజూకుగ నను దిట్టిన
నా జుట్టును బట్టుకొన్న నచ్చని దానిన్
తేజోమయమని పొగడుట
నా జన్మకు వీలుపడదు నమ్ము జిలేబీ

కం. నా కేమో లవకుశ యును
మీకు శ్రీరామరాజ్యమే హితమగుచో
నా కెనిమిది వందలు పొదు
పై కనుబడు చుండె నేటి వరకు జిలేబీ
యా దేవీ సర్వ భూతేషు

కం. అమ్మాయి కథను చదివితి
నమ్మ దయాగుణము దలచి యానందముచే
చిమ్మెను కన్నుల నీరును
నిమ్మహి భగవతికి సాటి యెవరు జిలేబీ.

కం. ముత్తాతగారి ముచ్చట
లిత్తెరగున చదువుచుండ నెటనో మరి నా
చిత్తంబున విభ్రమమగు
నుత్తమమీ సౌఖ్యమనగ నొప్పి జిలేబీ.

కం. ముని మనుమరాలి ముచ్చట
మునుకొని యా మూగతల్లి ముచ్చటగా తం
డ్రిని తాతను ముత్త్తాతను చే
సిన ముచ్చట సంతసింప జేసె జిలేబీ.

కం. సంతోషంబుల నెరుగుట
సంతోషము నాకు నిట్టి సంతోషంబుల్
వింతలె యీ జన్మంబున
నింతకు ముందెరిగి యుందు నేమొ జిలేబీ.

కం. అందరు సంతోషంబున
నుందురు గా కెల్లవేళ నుల్లాసముగన్
చిందులు వేయగ శ్రీలా
నందముగా నందరిండ్ల ననెద జిలేబీ.


కాఫీ కాలం

కం. శివ శివ యనుచును కాఫీ
నెవరైనను చేయునెడల నీశ్వరకృపచే
నవలీలగ నమృతంబగు
చవితో లోకంబు లేల జాలు జిలేబీ.

కం. నీరసపడితే మంచి హు
షారిచ్చే పొగలసెగల చక్కని కాఫీ
సారందీయగ హాయిగ
ఊరికి పను లప్పగించు చుండు జిలేబీ


శతకం లెక్కలు

కం. ఇన్నని నియమము గలదా
యెన్నైనను వ్రాయవచ్చు నేదో శతకం
బన్నప్పు డధిక మైనను
మన్ననలో మార్పురాదు మహిని జిలేబీ


వినమ్రత

కం. బందమొ ముందరి కాళ్ళకు
నందముగా భావమమర నగు పరికరమో
ఛందం బనునది దేవుం
డందించిన శక్త్తి కొలది యగును జిలేబీ.

కం. ఛందములాడించునొ నను
ఛందంబుల తోడ నాడ జాలుదునో నే
నందముగా వ్రాయుదునో
యిందుకు కొరగానొ దేవు డెరుగు జిలేబీ
 
******

Friday, January 4, 2013

నడుమందం బొడ్డందం వదులుకున్న నవ్య !

 
తెలుగు ప్రపంచ మహా సభల పుణ్యమా అని
మా ఆంధ్రజ్యోతి వారు మొట్ట మొదటి మారు
నవ్య ని ఆంధ్ర పత్రిక లా తీర్చిదిద్దారు. !
 
శభాష్ ఆంధ్రజ్యోతీ!
జిలేబి
 
Source:
http://www.navyaweekly.com/