Tuesday, December 20, 2011

బుజ్జి పండు తెలుగు చదువు - శ్రీ శంకర విజయం

బుజ్జి పండు తన తల్లి గారైన శర్కరీ జ్యోతిర్ 'మాయీ' వద్ద వారు నేర్పిన తెలుగుని నేర్చుకుంటూ తెలుగు కాంతుల విరజిమ్ముతూ తెలుగు బిడ్డగా అమెరికా దేశమునందు పెరుగు చున్నాడు.

ఆ తల్లికి, తన తనయుడు మరి ఇతర తెలుగు గురువుల వద్ద తెలుగు  నేర్చుకోవలె అనెడి కోరిక గలిగెను. తాను ఎంత నేర్పినను , సరియైన గురువు చెంత నేర్చిన విద్యయే కదా విరాజిల్లు అని ఆ తల్లి తలబోసి

'పుత్రా, బుజ్జి పండూ, నీవు నా దగ్గిర నేర్చిన తెలుగు ఇంకను అభివృద్ధి చేసుకొనుటకై నేను నిన్ను మరి కొందరు మన తెలుగు బ్లాగ్ గురువుల చెంత గురుకుల వాసము చేయుటకు పంపవలెనని నిశ్చయించితి అని ఆ మాత పలుకగా,

తనయుడు బుజ్జి పండు


'మాతా, నీ వాక్కు నాకు శిలోధాల్యము. వెంటనే సెలవీయుడు , నేను మొదట ఏ e-గులువుల వారి వద్ద వాసము చేయవలె' నని అడుగగా

ఆ మాత కడుంగడు ముదావహము తో

'పుత్రా బుజ్జి పండూ, నాకొక్క దినము అవకాశము నిమ్ము, నీకు ఆ గురువుల పేరు తెలిపెదను ' అని సంతోషానంద భరితు రాలై పుత్రోత్సాహముతో నాటి కార్యక్రమములను ముగించుటకు సంసిద్దురాలాయెను.

పుత్రుడు బుజ్జి పండు తాను నేర్చుకోబోవు తెలుగు ను దృశ్య కావ్యముగా జూచుచు నిదురయందు జారుకొనెను.


**********

శంకరార్యుల వారి శంకరాభరణం కొలువు జగజ్జేగీయ మానం గా కవి పండితాద్యులతో వెలుగొందుతోంది.

మహామహులైన పండితులు , నిష్ణాతులు , గ్రాంధికం , గ్రామ్యం కాచి వడబోసిన పెద్దల కొలువు అది.

ఆర్యులవారు చిరునగవుతో వీక్షించు చూ , తమ సహ పండితులని అష్ట దిగ్గజములై న వారిని ఒక మారు కలయ జూసినారు

కొలువులో

పండిత నేమాని వారు,
చింతా వారు
సుబ్బారావు గారు
శ్యామలీయం గారు
లక్కాకుల వారు
గోలీవారు
శ్రీపతి గారు,
రాజేశ్వరీ అక్కయ్య గారు

లాంటి అష్ట దిగ్గజములను గాంచి ఆ పై నను వున్న మీదు మిక్కిలి పండిత లోకమును గాంచి, ఆ నాటి కొలువు విశేషములు వారు మొదలు బెట్ట బూనినారు.

ఈ శంకరాభరణము కొలువు కు శ్యామలీయం గారు మంజరీ ద్వార పాలకులై ( ఆంగ్లములో గేటు కీపరు అందురు) కొలువుని కడు జాగ్రత్తగా కాపాడుకొంటూ తమ అసామాన్య ప్రతిభా పాటవాలతో ఒక వైపు ఐటీ రంగమును మరొక వైపు కవితా వెల్లువలను సమ పాళ్ళలో 'క్రోడీకరించి' న వారై , ఒక కన్ను ను ఎప్పుడు మంజరీ ద్వారముపై పెట్టి ఉందురు - ఏల అన ఎవరైనా తుంటరులు అనానిమస్సులై అక్కడ ప్రవేశించి ఏమైనా సభా భంగము గావించిన వారికి వెంటనే వారు ఝాడూ చూపించి తరిమి వేయుదురు.

అటువంటి గురుతరమైన భారముతో వారు శంకరార్యుల కొలువును గాపాడుచూ, ఒక వైపు గ్రాంధి క మా , మరో వైపు గ్రామ్యమా అన్న లక్కాకుల వారికి సమానముగా తమ బ్లాగ్కామెంట్ ఫటిమ లో నెగ్గుకుని వస్తూ, మంజరీ ద్వారమున ఒక్క మారు వీక్షించినారు శ్యామలీయం వారు.


(బుజ్జి పండు ప్రవేశం)

శ్యామలీయం మాష్టారు - తనలో

ఎవరో ఒక బుడతడు ఇటు వస్తున్నాడే ! ఈ సభా ప్రాంగణములో ఈ బుడతడికి పని ఏమి ?


ముక్కుపచ్చలారని ఈ పసిబాలుడికి ఈ ప్రబంధ ప్రదేశమున పని ఏమి ? అనుకున్న వారై,

(ప్రకాశముగా)

ఓరీ బాలకా, ఎవరవు నీవు ఎచట నుంచి నీ రాక ? అని గంభీరముగా చూసినారు. వారు గంభీర స్వరూపులు. వారి చూపులు నిశితమైనవి.

బుజ్జి పండు కొంత బెదిరి,

"మలీ మలీ అండీ, మలీ అండీ... మలీ అండీ .... "

మలీ మలీ ఏమిటి ? స్ప్రష్టముగా చెప్పుము ! నీ పేరేమిటోయీ ?

మలీ మలీ అండీ, నేను మా మాత పంపగా వచ్చినానండీ !

శ్యామలీయం మాష్టారు గారు అబ్బురు పడి పోయారు. ! ఈ బాలుడు మాత అన్న పదమును ఎంత స్వచ్చముగా స్వేచ్చెగా పలికినాడు సుమీ ! ఈ మమ్మీ ల కాలములో వీడు మాత అని పలకటం గొప్ప విషయమే !

వారు ఈ మారు కొంత స్వాంతన స్వరముతో బాలకా, నీ పేరు ఏమి ? అని నిదానముగా అడిగినారు

నా పేలండీ , నా పేలండీ, ...

ఓహో ఈ బాలకునికి సాధు రేఫములు పలకడం కష్టమైనట్టున్నది ! అని భావించి శ్యామలీయం వారు, పోనీ, మనమే వేరు విధముగా అడిగి చూతము అని,

బాలకా, నీ నామమేమి ? అని రేఫములు లేక సాధు గా అడిగారు ఈ మారు .

మీలు పెద్ద వాలండీ, నామమేమి అనకూడదు. నీ నామమెక్కడ అని అడగ వలె ! నా నెత్తిపై వున్నది చూడుడు , అని ఒక చెణుకు మన బుజ్జి పండు వేసి,

స్వామీ, నా నామము బుజ్జి పండు అని తనను పరిచయము చేసుకున్నాడు.

హార్నీ, బుజ్జి పండు , ఏమి ఈ తెలుగు పేరు ! ఈ కాలములో పిల్లలకి ఇంత మంచి స్వచ్చమైన పెరెట్టిన తల్లులు గారు వున్నందువల్లే కదా, ఈ శంకరాభరణము వంటి కొలువులు ఇంకనూ వర్దిల్లుచున్నవని వారు సంతోషపడి,

బుజ్జి పండూ, నీ చెణుకు కి నేను మైమరిచితిని.  నీ విక్కడి కి వచ్చిన కారణం బెద్ది ? అని వారు ప్రశ్నించారు.

"మా మాత, జ్యోతిల్మాయీ వాలు, నన్ను మలింత తెలుగు నేల్చుకొనుటకు మీ శంకలాభలనము కొలువుకి నన్ను పంపినాలు మా మాత నన్ను అమలికా నిండి ఇక్కడి కి పంపించినాలు మీ వద్ద అంతల్జాల వాసము చేయమని ' అన్నాడు బుజ్జి పండు.

శ్యామలీయం మాష్టారు, ఈ అబ్బాయి ని గాంచి ముచ్చట పడి, వీడికి ఒక్క రేఫమే కదా సమస్య ! ఈ తెలుగు లోకం లో ఎంత మందికి అసలు తెలుగే రాదు. అటువంటి కాలములో వున్న ఎందరికో కన్నా, ఈ బుడతడి ఉత్సుకతకి ఆ రేఫలోపము ( ఇది దుష్ట సమాసమా అని రేపు ప్రశ్న టపా లో వేయవలెనని గుర్తు పెట్టుకుని ) ఒక్కటే కదా, మన్నించి, శంకరాభరణం కొలువలో ఈ బుడతడికి ప్రవేశము కలిపించి ఈ బుజ్జి పండుకి తెలుగు నేల్పుదము ( హమ్మో, నాకు రేఫలోపము వస్తున్నదే సుమీ!, జాగ్రత్త గా వుండవలె అని మనస్సులో అనుకున్న వారై) అని తీర్మానించి,

బాలకా, బుజ్జి పండు, వేచి వుండుము, నేను సభా ప్రాంగణములో మా పండితుల వారి అనుమతి గైకొని వచ్చి నిన్ను తోడ్కొని పోవుదునని వాక్రుచ్చి, వారు సభా ప్రాంగణంలోనికి వెళ్ళారు.

**********
సభా ప్రాంగణమున బుడతడి గురించి చర్చా ఘట్టము

శ్యామలీయం మాష్టారు సభా ప్రాంగణమున ప్రవేశించి పిడుగు బుడతడి రాక ని కవి పండితాదులకి తెలియజేసారు.

"మన ఈ కవితా ప్రాంగణమున ఆ బుడతడు ఏమి నేర్చుకునును? దీనికి కొంత తెలుగు జ్ఞానము కలిగిన వారై , గ్రాంధికము తెలిసిన వారై వుండిన కదా ఏమైనా వారికి అర్థమగును ? అందులోనూ , బుడతడు అంటున్నారు శ్యామలీయం వారు . అంత చిన్న పిల్లవాడు మనతో ఎలా సంభాషించ గలడు ?" అన్న పండిత నేమాని వారి పృచ్చ తో సభా ప్రాంగణమున కలకలము, మంచి విషయము చర్చకు వచ్చినది అన్న సంతోషము వారిలో కలిగినది.

ఈ ప్రశ్న కి స్వయముగా సమాధానము జెప్పక ఎప్పటి వలె శంకరార్యులవారు అష్ట దిగ్గజముల వైపును, మీదు మిక్కిలి పండిత లోకమును గాన్చినారు చిరునగవుతో , మీ సమాధానం ఏమిటి జెప్పుడు అన్నట్లు. ! ఆర్యులవారు ఎప్పుడు తమ అభిప్రాయమును మొదటే జెప్పరు. అది వారి సొబగు. అప్పుడే కదా కవితా లోకమున ఇంద్రధనుస్సులు వెల్లి విరియును !

లక్కాకుల వారు వెంటనే లేచి, 'అయ్యలారా, మనం ఇంతగా సంకోచించ రాదు. మనము వృద్ధులమై పోతున్నాము. ఈ సభ మనతో నే ముగిసి పోవలెయునా ? నది పారును. తటాకము ఒక్క చోటే ఉండును. మనము తటాకం వలె ఒక్కరై ఉన్నాము. మనము నదియై పారవలె. అప్పుడే కదా ఈ కవితా లోకము అభివృద్ధి చెందును ? కాల ఘట్టములో చూడుడు, నదీ ప్రవాహక ప్రదేశములలో నే కదా జన జీవనము ? కావున నా అభిప్రాయం , మనము నదియై పారవలె. మనతో బాటు చిన్న కాలువలు రావచ్చును. అవి కొంత కాలం తరువాత మనలో కలసి, ఆవియును నదియై , మహానదియై రాబోవు కాలమునకు స్ఫూర్తి నిచ్చును " అని భావవేశాముతో తమ నిర్దుష్ట అభిప్రాయమును తెలియ జేసినారు.

ఈ మారు శ్యామలీయం వారికి 'భేషో లక్కాకుల మాష్టారు' అని మొదటి మారు అనాలన్న సంతోషము గలిగినది. తన మనసున వున్న మాటయే వారు కూడా అనేయటం తో వారికి ఇక బ్లాగ్కామెంటు ఇవ్వటం కుదరక శ్యామలీయం వారు లక్కాకులవారికి బ్లాగ్కామ్ప్లిమెంటు ఇచ్చి ముసి ముసి నవ్వులతో తమ ఆనందాన్ని తెలియ జేశారు.

ఇక మిగిలిన మాష్టార్లు , ఓ మోస్తరు గా , తమ అభిప్రాయమును లక్కాకుల వారి వలె తెలియజేసారు, తమదైన స్వంత శైలి లో.


రాజేశ్వరీ అక్కయ్య గారికి మొదటి మారు సంతోషం వేసినది. ఇప్పటిదాకా అందరు పెద్ద మనుషల సాంగత్యం తో తన చిలిపిదనం కట్టి బెట్టి కొంత గంభీరం గా ఉండవలసి వచ్చె. ఈ బుడతడి రాకతో వారి మాతృ హృదయము కొంత ఊరట జెందినది.

పండిత నేమాని వారు ముసి ముసి నవ్వులతో, మొత్తం చర్చని గమనించి,


'ఆర్యులారా, నేనలా మొదటే అనడం వల్ల మన చర్చా కార్యక్రమము రమ్యముగా జరిగినది. గురువు గా తమ మొదటి కర్తవ్యం శిష్యులలో ఉత్సుకతతని నెలకొల్పటం ! ఆ కర్తవ్యమును నేను సరిగ్గా నెరపినానని భావిస్తాను ! ఇక మనం శంకరార్యులవారి అభిప్రాయమును తెలుసు కొందుము ' అని ఆర్యులవైపు చూసారు వారు.

శంకరార్యులవారేమైనా తక్కువ వారా ? నాలుగు పదుల సంవత్సరం అధ్యాపక వ్రత్తి ని కడు రమ్యముగా గావిన్చినవారు. వారు అవుననీ కాదనీ అనకుండా , ఎప్పటి వలె,


' ఆర్యులారా, మనం ఏదైనాను సమస్యా పూరణము ద్వారానే కదా అన్నిటికి పరిష్కారము గావించెదం? కావున ఈ బుడతడికి కూడా ఒక ప్రశ్న ఇచ్చెదము . వాడు దానికి జెప్పు జవాబు బట్టి మనము తీర్మానించ వచ్చును ' అని శ్యామలీయం వారి వైపు తిరిగి, ' శ్యామలరావు గారు, ఆ బాలకుడు జెప్పినది ఏమి ? తన మాత మాట గా వచ్చితి నని కదా ? " అన్నారు

' అవును ఆర్యా' అన్నారు శ్యామలీయం మాష్టారు. ' ఇందులో ఏదైనా వేరే సూక్ష్మము ఏదైనా ఉందా ' అని ఆలోచిస్తూ.

'కావున ఆ బాలకునికి, వారి మాత గురించి జెప్పుమని ఒక ప్రశ్న వేసెదము. వాడు దానికి ఏమి జేప్పునో దానిని బట్టి మనము ఆతనికి సభా ప్రవేశము ను ఇచ్చుట యో లేక తిప్పి పంపి వేయుటాయో జేసెదము!' అని ఆర్యులవారు జెప్పారు.

అష్టదిగ్గజములు ఎప్పటి వలె దీనికియునూ తలయూపి, శ్యామలీయం మాష్టారు వైపు జూసినారు.

శ్యామలీయం వారు, 'నెమిలి' యై చెంగున ఎగిరి, బుజ్జి పండుని తమ మూపురము పై నిడుకుని సభా ప్రాంగణమున తిరిగ రాగా, ఆ షణ్ముఖు డే వచ్చాడా అన్నంత గా ఆ సభా ప్రాంగణము దివ్య కాంతులతో ప్రజ్వరిల్లినది.

**********


శ్యామలీయమైన నెమిలి పై నుంచి బుజ్జి పండు నిదానముగా దిగాడు.

ఆతన్ని జూసి సభా స్థలి అచ్చెరువొందినది. బుడతడి ముఖమున ఏదియో తెలియరాని జ్యోతి (ఆ మాత జ్యోతిర్మయీ మహత్వమేమో ?) ప్రస్ఫుటిస్తోంది.

ఇది అని చెప్ప నలవి కానిది.

షణ్ముఖుడు పంచకక్షం కట్టినవాడు.

ఈ బుడతడు జీన్స్ ప్యాంటు పై టీ షర్టు ధారి యై వున్నాడు. కంటికి హారీ పాటర్ అద్దములు కూడాను. నెత్తి పై నామము. కాలికి నైకే షూస్.

షణ్ముఖుడు వేలాధయుడు. ఈ బుడతడు శర్కరీ ధారీ.


ఒక చేత శర్కరీ , మరియొక్క చేత అంకోపరుండై వున్నాడు వీడు.

బుజ్జి పండు సభా స్థలి కి ప్రణమిల్లి ,

"సభ యందు వెలసిల్లిన పెద్దలన్దలికీ నా నమస్కాలములు ! నా పేలు బుజ్జి పండు , నేను మీ చెంత తెలుగు నేల్చు కొనవలె నని మా మాత ఆదేశానుసాలముగా ఇచ్చటికి వచ్చితిని " అని,

రాజేశ్వరీ అక్కయ్య వారి వైపు తిరిగి , " నమో మాతా , నమో నమః ! పెద్దమ్మ వాలికి నమస్సులు " అని 'స్పెషల్' గా నమస్కరించడం తో రాజేశ్వరీ అక్కయ్య వారు తబ్బి మొబ్బిబై

"రారార కన్నయ్య , రార వరాల పంట, రారార గారాల పట్టి ,తెలుగు నేర్వంగ " అని మురిసి పోయింది.

సభాస్థలి బుడతడి వైపు ఒక్క మారు , రాజేశ్వరీ అక్కయ్య వైపు ఒక్కమరూ చూసింది.

ఈ మాతలు ఎల్లప్పుడూ వెన్నె హృదయులే సుమా అని అచ్చెరువొంది న వారు, వీరు వెన్నపూసై కరిగి పోవడానికి అర నిముషము చాలు సుమా అని తీర్మానించు కున్నారు.

బుజ్జి పండు ఈ మారు శంకరార్యులవైపు తిరిగి నమస్కరించి,

"అందమగు బ్లాగు నిలిపిలి యందలి
హ్లుదయముల నిలిచి యానందము
పెంపొందిచిన గులువు గాలికి
నమస్సులు కవివల , జేజే"

అని సాదర ప్రణామము గావించాడు.

ఈ మారు శంకరార్యుల వారికి సందేహం వేసింది, " ఈ బుడతడు, మరీ తన బ్లాగు మొత్తం పరిపూర్ణముగా శోధించి వచ్చి వున్నాడేమో సుమీ " అని సందేహ పడిన వారై చిరునగవు ఒకటి నొసగి పండిత నేమాని వారి వైపు జూసినారు, ఆర్యా మీరు ప్రశ్నింపుడు బాలకుడిని అన్న చందాన.

పండిత నేమాని వారు, ఔరా , ఈ శంకరార్యుల వారి చాతుర్యమే చాతుర్యం - అన్నిటికీ నన్నే ముందు వుండమనటం అనుకుని,

ప్రకాశాముగా " బాలకా, నీవు ఇచ్చట తెలుగు నేర్చుకొనుటకు మీ మాత పంపగా వచ్చినావని మా శ్యామలీయం మాష్టారు జెప్పారు. మంచి ప్రయత్నమే. కానీ వచ్చినవాడివి ఎటువంటి వ్రాత పుస్తకములు లేకుండా వచ్చి నావే" అని ధర్మ సందేహం లేపారు.

అసలు బాలకా నీవు నిజంగానే నేర్వడానికి వచ్చినావా అని వారు నేరుగా అడిగి ఉండవచ్చు. కాని సూక్ష్మం గా వారు ఈ లా ప్రశ్నించారు. అది వారి చాతుర్యం.

బుజ్జి పండు తడుము కోకుండా టపీ మని,

" అయ్యా పండిత నేమానీ గులువా - హస్తభూషణముగ అంకోపలుండగా పుస్తకం బదేల హస్తమందు?" అని చిరు నగవుతో జెప్పి "అయ్యా చేత మా మాత నొసంగిన 'శల్కలీ ' సహిత ఇచ్చట వచ్చి వున్నాను ' అన్నాడు.

ఈ బాలకుడి రేఫమును ఎటుల సరి దిద్ద వలె నని శ్యామలీయం మాష్టారు తీవ్రముగా ఈ మారు చింతించడం మొదలెట్టారు.

" ఆర్యా, పండిత నేమాని వారు , ఆ బుడతడు శర్కరీ అన్న పదాన్ని అలా 'శల్కలీ' అన్నాడు. రేఫాలోపము అంతే.  ఒక చిన్న సందేహము నాకు ఇది దుష్ట సమాసమేమో " అన్నారు శ్యామలీయం వారు - నానాటికీ తీసికట్టు నాగంభట్లు అయిపోతున్నానే సుమీ అని కొంత నివ్వెర పడుతూ.

ఆ రేఫా లోపమును మీరి ఆ బుడతడు జెప్పిన సమాధానమునకు పండిత నేమాని వారు సంతసించి,

" శ్యామలీయం మాస్టారు, మీ సందేహ నివృత్తి వేరుగా చర్చించ దెము , ముందు ఈ బుడతడి సమాధానం మాకు బాగుగా నచ్చినది " అని ఆప్యాయముగా తన మనవణ్ణి జూసినంత గా బుజ్జి పండుని గాంచి నారు పండిత నేమాని వారు. మనవళ్ళ వయసులో వున్న పిల్లలని గాంచిన తాత గార్లకు ఎల్లప్పుడూ సంతోషదాయకమవడం ప్రకృతి సహజ మే గదా!

పండిత నేమానీ వారు ఇంత శీఘ్రం గా కరిగి పోతారని అనుకోని గోలీ వారు దీర్ఘముగా బుడతడు బుజ్జి పండు ని గాంచి,

"నాయనా బుజ్జి పండు.. నీ ఇచ్చుకని మేము మేచ్చితిమి. అయినన్ను , మీ మాత మాట మీదుగా ఇచ్చటికి వచ్చి నాడవని అంటున్నావు. మరి మీ మాత గురించి నీకు తెలిసిన ఒక పద్యము జెప్పుము అని ఒక బాణాన్ని ఎక్కు పెట్టారు సూటిగా.

గోలీ వారు వారు పేరు కు తగ్గట్టు గోళీ సూటిగా వేయుదురు -వారు, మధురమైన పద్యము ముందు  "తేనె రుచిని జూడ తీయదనము లేదు - పటిక బెల్లమందు పసయె లేదు - చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు" అని అంతర్జాల పథముగా నొక్కి వక్కాణించినవారు కూడాను!

ఇలా సూటిగా గోలీ వారు బుజ్జిపండు ని బరిలోకి లాగడం తో , సభాస్థలి బుజ్జి పండు ఏమి జెప్పునో అని కుతూహల పడి ఆతురతతో బుడతడిని గాంచినది !

బుడతడు నిదానముగా సభా స్థలి ని కలయ జూసి, పండిత గోలీ శాస్త్రు లవారి కి ప్రణామం బులు వొనరించినాడు .
**********

గులువులు హనుమచ్చాస్లీ గాలికి నమస్సులు.

" అజాడ్యం వాక్ పటుత్వం చ హనూమత్ స్మలనాత్ భవేత్ " అని మా మాత చెప్పాలు. మీలు వాలి నామధేయులు. కావున మీ స్మలణతో మా మాత గులించి చెబుతాను -

"నడకలు నేల్పెను
నడవడికలు నేల్పెను
నడతను నేల్పెను
బుడి బుడి నడకల
బుజ్జి పండు
బుద్ధుడే అవుగాక ! అని మా మాత నాకు అన్నియు నేల్పెను" అన్నాడు బుజ్జి పండు.

గోలి వారికి ఈ బుడతడు హనూమంతుడు కన్న రాముడే అయ్యాడు ఆ బుజ్జి పలుకులు విని.

ఈ మారు చింతా వారు, 'ఈ గోలీ వారూ బోల్తా పడ్డారే సుమీ ' అని బుజ్జి పండు ని వుద్దేశించి,

" బుజ్జి పండు - అమెరికా దేశములో తెలుగు నేర్చుకొనుటకు ఎన్నో పుస్తకములు వున్నాయి కదా ? వాటితోనే నీవు నేర్చుకోవచ్చు గదా ? ఇలా శంకరాభరణం కొలువు లో అంతర్జాల వాసం అవరసరమా ? " అని బుజ్జి పండుని 'పరి' శోధించారు!

దానికి బుడతడు, క్షణ మాత్రములో , "చింతావాలు! మీ వంటి గురువుల మస్తకమును మించునే పుస్తకమ్ము " అని తడుముకోకుండా జవాబు చెప్పాడు.

బుజ్జి పండు అంత వేగం గా తనకు సమాధానము చెప్పునని చింతా వారు ఎదురు చూడ లేదు !

కొంత కాలం మునుపే ఈ శంకరాభరణం సదస్సు 'మస్తకమ్మును మించునే పుస్తకమ్ము ' అని ఘంటా పధం గా ఘోషించింది కూడాను! కాబట్టి వేరుగా చెప్పనలవి కాదు !

పండిత నేమాని వారి వైపు సభా సదస్సు చూసింది. శంకరార్యులు కూడా చిరు నవ్వు నవ్వుతూ, ' ఆర్యా ! పండిత నేమానీ సన్యాసీ రావు గారు మీ అభిప్రాయం ? " అన్నారు.

పండిత నేమాని వారు సభను ఉద్దేశించి,

మిత్రులారా!

భాష, పద్య కవిత్వము ఎవరికి అలవడును అని ఒకపరి పరికించుచో -పెద్ద పెద్ద చదువులు కలిగిన వారు ఒక పాదము కూడా చెప్ప లేక పోవచ్చును; సామాన్యులైన వారు చక్కని సహజ కవిత్వముతో జనరంజకమైన కవిత్వమును చెప్ప గలుగుచున్నారు. వాగ్దేవి యొక్క సంపూర్ణ అనుగ్రహము మరియు పూర్వ జన్మల సంస్కారము గలిగిన వారికి పద్య కవిత్వము అబ్బును. ఈ మంచి యోగమును ఈ బాలుడు పొందిన వాడిలా వున్నాడు. మనము ఈతనికి చదువులు నేర్పుతూ ఇంకా ప్రోత్సాహముతో ఈ బుడతడి తెలుగు చదువును ముందుకు సాగానిద్దాము " అన్నారు.

ఈ పలుకులు విని

చింతా వారు ఆనందోత్సాహముతో ,

" వరహృదయమ్మునన్
తెలుగు భాషను చక్కగ నభ్యసించి చాతురి
మెరయన్ కవిత్వమున దొడ్డతనమ్మును
జూపుచున్ సుధీవరుల ప్రశంసలొందు బుజ్జి పండూ" అని ఆశీర్వదించి, నిరతము వృద్ధి చెందుచును నీ కృషి యిచ్చును సత్ఫలమ్ములన్ " అని మెచ్చు కున్నారు కూడాను.

సురా బ్లాగీయం సుబ్బారావు గారికి బుడతడి నడవడిక, నడత, మాటలు చాలా నచ్చాయి. వారు వెంటనే ఆశువుగా



"తల్లి దండ్రుల యందున తల్లి మిన్న
సుతుని బాగోగు లన్నియు చూచు చుండి
కంటికిని రెప్ప యట్లయి కాచు చుండు
దైవ మున్న దె ? సుతునకు తల్లి కంటె ? "

అని బుజ్జి పండు మాతని కొనియాడి, బుజ్జి పండుని మనసారా ఆశీర్వదించారు !

శంకరార్యులవారు, సభనుద్దేశించి,

"మన భాషా పండితులు అందరూ కూడా అంకిత భావంతో భాషాభిమానంతో భాషాసేవ చేస్తూ తమను నమ్మి తమదగ్గర విద్యకొఱకు వచ్చే విద్యార్థులకు ధర్మ బద్ధంగా విద్య గరుపుతూ ఆంధ్రవిద్యార్థులకు ఆంధ్ర భాషాభిమానం పెరిగేలా చేయాలన్న కోరికతో ఉన్నవారే ! వారు గురుతరమైన గురువు భాద్యతలను నెరవేర్చి, బుడతడైన బుజ్జి పండుని తమ తమ విధానాల మూలముగా తమ శిష్యునిగా చేసుకోవటం నాకు చాలా సంతోషాన్ని కలుగ జేస్తున్నది.  


తెలుగు వారంత కలసిన వెలుగు బాట , మలచి పూయించి వచ్చు మావి తోట ! తెలుగు వారన్న వెలుగుల జిలుగు వారు , యెచట నున్నను గెలుపొందు రచటె వారు!

కాబట్టి ఈ బుడతడైన బుజ్జి పండుకి మన సభా ప్రాంగణమున మనము మరింత తెలుగు నేర్చుకొనుటకు, మనము ప్రోత్సాహము ఇచ్చెదము.

లక్కాకుల వారు మొదట చెప్పారు- మనము నది అయి ప్రవహించా లని.

మనము జీవ నదులమై ఈ భువి మండలమున తెలుగు వ్యాప్తికై మన వంతు కర్తవ్యం నెరవేర్పుదాము ! ఈ బుజ్జి పండు రాక మన సభా స్థలి కే వన్నె తెచ్చినది. అని చెప్పి బుజ్జి పండు వైపు తిరిగి


"శతమానం భవతి బుజ్జి పండు" అని మనసారా దీవించారు.

ఇందరి గురువుల ఆశీర్వచనములతో బుజ్జి పండు రేఫా లోపమూ మటుమాయమై పోయినది.

శ్యామలీయం వారు, లక్కాకులవారు చేతిలో చేయి వేసి శభాష్ అని భుజాలు తట్టుకున్నారు

రాజేశ్వరీ అక్కయ్య గారి గురించి చెప్ప వలెనా ?

"చిన్న నాటను చేయగ చిలిపి పనులు , తల్లి చాటున ముద్దుల తనయు డనగ, ఈ బుజ్జి పండు ఎదుగ వలె జగద్గురు వనంగ" అని మనసారా కోరుకున్నారు వారు.




సభా స్థలి లో గణ గణ గంట మోగింది.
బుజ్జి పండు ఆశువుగా అందుకున్నాడు. 

గదిని గోడకున్న గడియారమున గంట,
చర్చి గంట, పాఠశాల గంట,
గిత్త మెడను గంట,కేశవు గుడి గంట,
టంట, టంట, టంట, టంట, టంట. !!!
శ్రీ పతి వారు సంఘ సూక్తం తో  ముగించారు
సమానో మంత్రః సమితిహ్ సమాని
సమానం మనః సహ చిత్తమేషామ్
సమానం మంత్ర మభి మంత్ర ఎవః
సమానేన వో హవిషా జుహోమి
సమాని వ ఆకూతిహి
సమానా హృదయానివః
సమానమస్తు ఓ మనో
యథా వః సు సహా సతే !!!


ఇంతటి తో బుజ్జి పండు తెలుగు చదువు -  శ్రీ శంకర విజయం అను అంకము సమాప్తము.


బుజ్జి పండు శంకరాభరణ కొలువులో తెలుగు పరి పూర్ణముగా నేర్చుకుని, తిరుగు దారి అమెరికా కి పట్టాడు.

మధ్య దారిలో ఆతని విమానము ఫ్లైట్ లే ఓవర్ లో , జర్మెనీ దేశంలో ఫ్రాన్క్ఫర్టు అంతర్జాతీయ విమానాశ్రయం లో  ఆగింది. లే ఓవర్ సమయం లో బుజ్జి పండు కునుకు తీస్తూండగా 'కిడ్' నాప్ కాబడి నాడు. !

దీనికి మూల కారకులు కొందరు భామలు. వారిలో సూత్రధారి అయినవారు మధుర వాణీ గారు -  జర్మనీ వాసులు.

 
వారు 'ఈ' కిడ్ - నాప్ ఎందుకు చేసారు ?
దాని కథా కమామీషు ఏమిటి ? రాబోవు అంకము- బుజ్జి పండు తెలుగు చదువు - భామా విజయం కై వేచి చూడుడు.!