చరాచరములు
కం. చరమచరంబుల బేధము
చరమచరంబులకు మధ్య సామ్యంబును ఆ
చరమున కచరంబునకును
నెరవగు తత్వమును గూర్చి నేర్పు జిలేబీ
కం. వినుడని ఘన తత్వంబును
కనుడని సూక్ష్మంబు తెలిసి గాంధీ రీతిన్
మనుడని కర్మిష్ఠులరై
జనులకు నెలుగెత్తి చాట జాలు జిలేబీ
కం. నరులార చరాచరముల
చరాచరేతరపరమవిషయతత్వములన్
పరుగాపి పట్టుకొమ్మని
మరిమరి బోధించు చుండె మనకు జిలేబీ
హిందీ
కం. హిందీలో రాస్తారా
ఎందుకునూ పనికిరాని హిందీ నాదే
అందం చందం తెలియక
కందానికి పెద్ద శిక్ష కలిగె జిలేబీ
చీనా బంగారం
కం. బంగారం ఓ చైనా
బంగారం యెప్పు డూడి పడతా వంటూ
బెంగపడి వేడు తున్నా
చెంగున రాదాయె పసిడి చెలువ జిలేబీ
చిలకలపూడి బంగారం
కం. వెల తక్కువ బంగారం
చిలకలపూ డనెడి యూర చిక్కేనటగా
వలసినచో ఆత్రేయను
పిలచిన ధగధగలు వెల్లి విరియు జిలేబీ
స్వర్ణ వైరాగ్యం
కం. ఔరా బంగారంపై
వైరాగ్యం తెచ్చుకున్న వచ్చేసేనా
భారత నారికి పసిడికి
తీరని యనుబంధమెంత తీపి జిలేబీ
కం. కొనగలిగి నపుడు పసిడిని
కొనవచ్చును కోర్కె తీర కొనలేకున్నన్
తన కంత మోజు లేదని
యనుటే సరియైన మాట యగును జిలేబీ
అందం ఆనందమయా
కం. తానెవ్వరు తనకెవ్వరు
మానిత స్నేహములు బంధుమరియాదల తో
ఆనందమేల తనకగు
ధ్యానంబున వీని తెలియ దగును జిలేబీ
కం. తాను వినిశ్చయముగ పూ
ర్ణానందమయుండు తనకు నందరు నట్లే
కాని యవిద్య కొడంబడి
జ్ఞానవిహీనుడుగ నుండు జనుడు జిలేబీ
పరిచయ బాంధవ్యం
కం. నరులకు సంసర్గముచే
పరమ సుఖ బ్రాంతి కలిగి బంధములందే
నిరయంబగు సామాన్యపు
పరిచయబాంధవ్యసమితి వలన జిలేబీ
కం. గాలిని యూరక తిరిగెడు
ధూళికణంబులను బోలు దోషాస్పదముల్
నేలను పెక్కురి బ్రతుకులు
కాలంబున వారి జాడ కరగు జిలేబీ
కం. ఉత్తములగు కొందరు తమ
చిత్తంబుల నధిగమించి స్థిరులై సత్తున్
చిత్తునెరుంగుచు పొందెద
రిత్తనువుల గడచు జ్ఞానమెల్ల జిలేబీ
కం. అతికొద్ది సంఖ్య నుండెద
రతులిత కరుణాప్రపూర్ణులగువారలు స
మ్మతి నితరులకును తగు స
ద్గతిమార్గము జూపునట్టి ఘనులు జిలేబీ
కం. తగువారు గురువులనగా
జగమున తఛ్ఛిష్య గణము సత్పురుషులుగా
నగుటేమి వింత విషయము
భగవంతుడు వారి నిష్ట పడును జిలేబీ
విన్నపాలు వినవలె
కం. అందుకు అభ్యంతరమా
అందుకొనుడి శర్మగారు హాయిని గొలిపే
కందాల విందు రోజూ
అందాల టపాలు వేసి అప్పటికపుడే
లవ్ దై నైబర్ ...
కం. పక్కింటి వాళ్ళ నెరగం
ఎక్కడనో ఉన్న వాళ్ళు నెట్-ప్రియ మిత్రుల్
పక్కదిగిన యిల్లు మరల
పక్కెక్కేవేళ కంట బడును జిలేబీ
జలపుష్పం
కం.నీ వలెనే జలపుష్పపు
ఠీవిని దర్శించి నట్టి డెందం బరుదే
పూవులలో నది మేలన
కావలసిన యెరుక నీకు కలిగె జిలేబీ
కామెంటు ఉత్ప్రేరకం
కం. రమ్మా చక్కని కామెం
ట్లిమ్మా నీ రాక లేక లేఖిని ఆగే
నమ్మా జిలిబిలి పలికుల
కొమ్మా కందాలనందు కొనుమ జిలేబీ
ఉపకారం
కం. ఉపకారవ్యసనులతో
నెపమిడి పదిపనులు కొనగ నేర్చెడు వారే
ఉపకారమడుగ బోయిన
నపవాదులు వేయు వార లవని జిలేబీ
కం. అపకారుల కుపకారము
విపరీతఫలంబునిచ్చు విమతుల నటులే
యుపకార బుధ్ధి విడచుట
నెపమై దాస్యమున కూలె నేల జిలేబీ
కం. మొగమోటమి గలవారిని
పొగడిన పని జరుగు ననుచు పోగగు వారల్
మొగ మైన జూప రావల
తగు జాగ్రత వలన చిక్కు తప్పు జిలేబీ
ఊరికి బాసట
కం. ఊరికి బాసట యగుచో
నూరక నోరార పొగడు నోళ్ళకు కొదవే
వారల యందే యొక్కరు
రారుసుమా మనకు నక్కరైన జిలేబీ
కం. ఆ యింటి మామిడాకులు
వే యిండ్లకు తోరణాలు మరి యేటేటా
కాయలు పచ్చళ్ళకు దయ
చేయించు పరోపకార జీవి జిలేబీ
ఇరుకు జీవితాలు
కం. ఇళ్ళిరుకులు గుళ్ళిరుకులు
పల్లెలు పోటెత్తి రాగ పట్నా లిరుకుల్
బళ్ళిరుకు మనసులిరుకులు
కల్లలతో బ్రతుకులిరుకు కలిని జిలేబీ
'వి' గ్రహాలు
కం. పడి పోయిన పడ నుండిన
పడి లేచిన విగ్రహాల బాధలు చూస్తూ
మిడికే నేతల బొమ్మలు
పొడమును పడిపోవు నటులె పుడమి జిలేబీ
ప్రవీణు శర్మ
కం. నేరక ప్రవీణు శర్మకు
మీరు జవాబిచ్చి గాని వివరించారో
వారింక మిమ్ము వదలరు
పోరాడే యోపికుంటె పొండు జిలేబీ
ఇన్నయ్య ఎవరు ?
కం. ఇన్నయ్య హేతువాదుల
కన్నయ్యే హైందవంబు నంతంచెయ్యా
లన్నదె ఆయన ధ్యేయం
బెన్నటికిని మారజాల డితడు జిలేబీ
కం. పళ్ళున్న చెట్లమీదే
రాళ్ళుగదా హేతువాద రాకాసి జనం
నోళ్ళన్నీ వేదనిందకు
పళ్లికిలిస్తాయి బాధ పడకు జిలేబీ
మ్యాచు ఫిక్సింగు !
కం. ఓడుతు పోతున్నారని
వాడల వాడలను తిట్ల వర్షాలాయే
నేడొకటి గెలవగానే
తేడానూ ఒప్పుకోరు తిరిగి జిలేబీ
కాపీ 'రైటు' జన్మ హక్కు
కం. కాపీ కొట్టే రైటుకె
కాపీరై టనెడి పేరు ఖాయం ఐతే
కాపీ పిల్లుల తప్పా
పాపం మన పాలు వారి పాలు జిలేబీ
సిగ్గే సింగారం
కం. సిగ్గేమిటి బేహారికి
సిగ్గేమిటి హంతకునకు సినిమా నటికిన్
సిగ్గేమిటి మరి నేతకు
సిగ్గేమిటి సిగ్గు పడును సిగ్గు జిలేబీ
నడక-నడత
కం. నడకలు కుదురుగ నుండిన
పడకుండగ నరుడు బ్రతుకుబాటను నడచున్
గడబిడ పడి వడిపెంచిన
పడుటయు చెడుటయును గల్గు వసుధ జిలేబీ
కం. నడకలు నేర్పెడు పెద్దలు
నడతలు నేర్పించ నెదురు నడచును మరియున్
కొడుకులు కూతుండ్రకు తా
నడతలు నేర్పించ గోరు నరుడు జిలేబీ
గారెల పాకం
కం. పాకం గారెలు చేస్తే
నాకం కనిపించవచ్చు నాకూ మీకూ
పాకం చేస్తే గారెలు
ఆకలి చచ్చేది ఖాయమగును జిలేబీ
పంచ దశ లోకం
కం. పదునైదవ లోకం బె
య్యది మరి యటనుండు వారి యాకృతి గుణసం
పద లెట్టులుండు నోహో
అది అంతర్జాలలోక మగున జిలేబీ
'గ' మకం !
కం. నిందార్ధంబున నాంధ్రము
నందున నామ్రేడితమును నాపైన గిగీల్
చిందులు వేయును మరి యా
నందార్ధము సూత్ర మేది నడచు జిలేబీ
పాత పచ్చడి
శొ, పాతది యగుచో నేమగు
పాతది యగు చింత కాయ పథ్యం బనగా
తాతలనుండి ప్రసిధ్ధం
బీతరమున మెచ్చకున్న నేమి జిలేబీ
పరహిత వైద్యం
కం. తరచుగ బహుదేహంబుల
తిరుగెడునది తానె యనుచు తెలిసి తగుగతిన్
పరిచర్య చేయునదియే
పరహితమన నెగడు చుండు వసుధ జిలేబీ
కం. కాలగతి చెందువిద్యల
కాలము పునరుధ్ధరించగల తరుణములున్
కాలస్వరూపుడగు హరి
లీలలచే నిలను పొటమరించు జిలేబీ
రాబోవు కాలం
కం. మునువచ్చు చెవుల కన్నను
వెనుకనె పొడచుకొని వచ్చి పెరిగెడు కొమ్ముల్
మొనదేరి ధృడత నుండవె
మనుమలకే తెలివి హెచ్చు మహిని జిలేబీ
చేతులు కాలాక
కం. చేతికి సెగ సోకినచో
మూతికి మహబాగ గోరు ముద్దలు దొరకెన్
తాతకు నాతికి నిద్దరి
కీ తీరున సంబరములు హెచ్చె జిలేబీ
కం. జరిగిన జ్వరమంతటి సుఖ
మరుదని చెప్పుదురు గాదె అటులే ముద్దల్
సరదాగ నోటికందుట
మరి యెందరి భాగ్య మన్న మాట జిలేబీ
కం. ఇది చాలా బాగున్నది
బ్రదుకున నిటుంవంటి తీపి ప్రతివారికి నం
దదు నిక్కంబుగ భళిరే
ముదిమికి ముచ్చట్లు లావు పుడమి జిలేబీ
కం. తప్పులు సైరించెడు సతు
లెప్పుడు పడుచుందు రిడుము లీ విధముగనే
తప్పున్న దిద్దకుండిన
తిప్పలు పెట్టుటయె మగల తీరు జిలేబీ
ప్రేమిస్తున్నా
కం. ప్రేముడి యెంతయు గొప్పది
కామంబును ప్రేమయొకటి గావను నెరుకన్
సేమంబుగాంచు టొప్పును
ధీమంతుండుండు దీని తెలిసి జిలేబీ
కం. అన్నన్నా దిన మొక్కటి
యున్నదనన్ ప్రేమికులకు యుర్విని ఘనమై
మున్నూరరువది నాలుగు
చిన్నదనము బొందు నేమి చేతు జిలేబీ
కం. ఆదిన మీదన మని యే
డాదిని గల దినములన్ని యటునిటు పంచన్
మీదెరుగు తలపు జేయగ
నే దినమును మిగుల లేదు నిజము జిలేబీ
సన్యాసి బుట్టలో పడ్డాడు
నచ్చిన సుందరి యెందుకు
వచ్చెడు నొక బుట్టలోన వయ్యారముగా
తెచ్చిన యా బుట్టనె విభు
ముచ్చట చెఱ గొనగ గాక పోదు జిలేబీ
అందాల బుట్ట లోపలి
సుందరవదనారవింద సుదతీమణి చే
యందుకొనిన సన్యాసియె
వందేళ్ళకు బంది యనగ వచ్చు జిలేబీ
సన్నాసిని చేసెడునో
సన్నాసిని చూసి కన్య సరదా పడునో
సన్నాసియగుట తథ్యం
బన్నన్నా పురుషు డాలి బంటు జిలేబీ
నల్లని కురులు
వెల్లుల్లి తలకు పూసిన
నెల్లరు దూరంబు జరుగ నిక కేశములా
తెల్లనివో నల్లనివో
అల్లరి యిక లేదు గనుక హాయి జిలేబీ
మధురాధిపతే అఖిలం మధురం
కం. మధురాధిపతి స్పెషల్గా
మధురం బతివలకు నైన మాసంగతియో
మధురాధిపతి యఖిలజన
మధురాకృతి నేను వినక మాన జిలేబీ.
ఎంతెంత దూరం
కం. కామెంట్లైతే శతకం
మీ మాటల గారడీలు మెప్పించెను నే
నేమో శతకానికి ఇం
కేమాత్రందూరముంటినిపుడు జిలేబీ?
బంగరు మాటల మూట
కం. ఈ రసన యెంత చెడ్డది
నోరదుపున నున్నవాడు నూటికొకండుం
ధారుణి నుండునొ యుండడొ
తీరుగ నటులుంట యోగి తీరు జిలేబీ
కం. మాటాడుట చక్కని కళ
మాటాడక యుండు నేర్పు మరియుం ఘనమై
కోటికి నొకనికి గల్గెడు
ఓటివి తక్కొరులనోళు లుర్వి జిలేబీ
ఇల్లాలి అవధానం
కం. ఇల్లెంత పదిలమగునో
యెల్లరు నెరుగుదురుగాని యెందరి కెరుకా
యిల్లాలి చలువ చేతనె
యిల్లన గల దనుచు వారి కిలను జిలేబీ
కం. పిల్లలు పెద్దసమస్యలు
కొల్ల నిషేధాక్షరులను కూర్చెదరత్తల్
చెల్లించుచు నప్రస్తుత
మెల్లప్పుడు పలుకు భర్త ఇలను జిలేబీ
కం. అవధాని పడెడు కష్టము
లవి యణగును ఝాములోన నందరు పొగడన్
భుని నిల్లాండ్రకు నిత్యం
బవధానమె మెప్పు కాన బడదు జిలేబీ